Share News

TS News: నల్లవల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ..

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:54 AM

అతడో సీరియల్‌ కిల్లర్‌. అడ్డా మీద కూలి పనుల కోసం వచ్చే ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తాడు. నమ్మించి తీసుకెళ్లి చంపేస్తాడు. వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు కాజేస్తాడు.

TS News: నల్లవల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ..

సీరియల్‌ కిల్లర్‌ డప్పు గోపాల్‌ అరెస్టు

గుమ్మడిదల, మార్చి 13: అతడో సీరియల్‌ కిల్లర్‌. అడ్డా మీద కూలి పనుల కోసం వచ్చే ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తాడు. నమ్మించి తీసుకెళ్లి చంపేస్తాడు. వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు కాజేస్తాడు. ఇప్పటికే ఐదు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు.. ఓ కేసులో యావజ్జీవ శిక్ష కూడా అనుభవించాడు. అయినా, అతడి తీరు మారలేదు. సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో ఓ మహిళను హత్య చేసి, పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు జిన్నారం సీఐ సుధీర్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మూడావత్‌ మంగమ్మ(40) హైదారాబాద్‌లోని బాలానగర్‌లో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగించేది. అదేజిల్లా అయ్యగారిపల్లికి చెందిన నిందితుడు డప్పు గోపాల్‌ గత ఏడాది అక్టోబర్‌ 28న ఆమెకు పరిచయమయ్యాడు. తాను గుమ్మడిదల ప్రాంతంలోని తోటలో పని చేస్తుండగా బంగారం దొరికిందని, దానిని అమ్మేందుకు సహకరిస్తే ఆ డబ్బులో వాటా ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఆటోలో ఆమెను గుమ్మడిదలకు తీసుకువచ్చాడు. ముందస్తు పథకం ప్రకారం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆమె ధరించిన చీరతోనే.. ఆమె మెడకు ఉరి బిగించి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెల తాడు, కాళ్ల కడియాలు తీసుకుని పరారయ్యాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డప్పు గోపాల్‌ను అరెస్ట్‌ చేశారు. గోపాల్‌పై మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఐదు హత్య కేసులు, రెండు రాబరీ కేసులు నమోదై ఉన్నాయి. కొడంగల్‌లో జరిగిన హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడగా.. అనుభవించి బయటకు వచ్చాడు. ఆరు నెలల క్రితం కూడా నర్సాపూర్‌లో అడ్డా మీద పని కోసం చూస్తున్న ఓ మహిళను కూడా ఇలాగే తీసుకెళ్లి చంపేసి.. కాళ్ల కడియాలు, చేతి కడియాలు తీసుకుని పారిపోయాడు. ఇలా దోచుకెళ్లిన వస్తువులను గొట్టిముక్కలకు చెందిన సోని అనే మహిళ సాయంతో అమ్మించే వాడు. గుమ్మడిదల పోలీసులు నిందితుడు డప్పు గోపాల్‌తోపాటు, అతడికి సహకరించిన సోనిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలిచారు.

Updated Date - Mar 14 , 2024 | 08:56 AM