Share News

Manchiryāla- మిల్లర్ల మాయాజాలం

ABN , Publish Date - May 31 , 2024 | 10:39 PM

జిల్లాలోని రైసు మిల్లుల యజమానులు ప్రభుత్వానికి సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి సీజన్‌లో ప్రభుత్వం పలు ఏజెన్సీలతో నేరుగా కొనుగోలు చేస్తున్నారు.

Manchiryāla-       మిల్లర్ల మాయాజాలం
జైపూర్‌లో అధికారులు సీజ్‌ చేసిన రైస్‌ మిల్లు

- ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నా స్పందన కరువు

- జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌

మంచిర్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైసు మిల్లుల యజమానులు ప్రభుత్వానికి సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి సీజన్‌లో ప్రభుత్వం పలు ఏజెన్సీలతో నేరుగా కొనుగోలు చేస్తున్నారు. అలా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) కోసం రైస్‌ మిల్లర్లకు అప్పగిస్తుంది. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు దాన్ని మరాడించి, బియ్యంగా మార్చి పౌరసరఫరాల శాఖ ద్వారా తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కాగా సీఎంఆర్‌ కోసం సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు మరాడిం చకుండా అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఏ సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని అదే సీజన్‌లో ఇవ్వాల్సి ఉన్నా మిల్లర్లు ఏళ్ల తరబడి పక్కదారి పట్టిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో సీంఆర్‌ పెండింగులో పడింది.

- పెండింగులో 69,361 మెట్రిక్‌ టన్నులు..

గత ఏడాది వానాకాలం సాగుకు సంబంధించి జిల్లాలోని 51 రైస్‌ మిల్లులకు పౌరసరఫరాల శాఖ 1,31,825 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అలాట్‌మెంట్‌ ఇచ్చింది. సీఎంఆర్‌కు ఎంపిక చేసిన వాటిలో 19 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉండగా, 32 రా రైస్‌ మిల్లులు ఉన్నాయి. సీఎం కింద మిల్లర్లు క్వింటా ధాన్యానికి 67 శాతం చొప్పున 93,575 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ధాన్యం తీసుకున్న రోజు నుంచి గరిష్టంగా రెండు నెలల్లో సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉండగా, సీజన్‌ ముగిసినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 24,214 మెట్రిక్‌ టన్నుల బియ్యం డెలివరీ కాగా, మరో 69,361 మెట్రిక్‌ టన్నులు పెండింగులో ఉంది. ఒక్క వానాకాలం సీజన్‌కు సంబంధించి 69 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పెండింగులో ఉండగా, ఏళ్ల తరబడి మిల్లర్లు సీఎంఆర్‌ ఇవ్వడంలేదని అధికారులు చెబుతున్నారు.

- నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై..

సీఎంఆర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్‌ మిల్లర్లపై అధికారులు చర్యలకు పాల్పడుతు న్నారు. సీఎంఆర్‌ కోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో ప్రత్యక్ష చర్యలు చేపడుతున్నారు. ధాన్యం తీసుకుని, అసలే స్పందని మిల్లర్లపై పోలీస్‌ కేసులు నమోదు చేయిస్తున్న అధికారులు కొన్ని చోట్లా రైస్‌ మిల్లులను సీజ్‌ కూడా చేస్తున్నారు. 2022-23 వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ కోటా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన మిల్లర్లపై చర్యలకు పూనుకుంటున్నారు. ఇందులో భాగంగా జైపూర్‌ మండలం ఇందారంలోని శివసాయి మిల్లును మూడు రోజుల క్రితం అధికారులు సీజ్‌ చేశారు. అలాగే స్వల్ప మొత్తంలో పెం డింగులో ఉన్న మిల్లర్లకు సీఎంఆర్‌ కోసం మరికొంత సమయం ఇస్తుండగా, అధిక మొత్తంలో బకాయిలు ఉన్నవాటికి 25 శాతం జరిమానా, జాప్యం జరిగిన ప్రతి ఏడాదికి 12 శాతం వడ్డీతో కలిపి మెట్రిక్‌ టన్నుకు రూ. 3589.20 చొప్పున వసూలు చేయనున్నారు.

- ధాన్యం కొనుగోళ్లలో..

రైతులు సాగుచేసిన ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు ప్రతిసీజన్‌లో పడుతున్న శ్రమ అంతా ఇంతకాదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం నుంచి ధాన్యం తూకం వేసి, లారీల్లో మిల్లర్లకు తరలించే వరకు అధిక ప్రయాసలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో లక్ష్య చేరేందుకు నానా తంటాలు పడుతున్నారు.కాఆగా మిల్లర్ల మాయాజాలం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మిల్లింగ్‌ చేయడంలో రకరకాల కారణాలు చెబుతూ ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. గత సీజన్‌లకు సంబంధించి ఇంకా 21 మిల్లుల్లో సీఎంఆర్‌ పెండింగులో ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా సీఎంఆర్‌ ఇవ్వకుండా మిల్లర్లు ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకోవడం ద్వారా కోట్లు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం సీఎంఆర్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో మిల్లరు టార్గెట్‌ పూర్తి చేసేందుకు నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 31 , 2024 | 10:39 PM