దగాపడుతున్న దొండ రైతులు
ABN , Publish Date - Apr 10 , 2024 | 11:56 PM
నల్లగొండ జిల్లా పీఏపల్లి, గుర్రంపోడు మండలాలలో 15 వేల ఎకరాలకుపైగా దొండ, మునగ పంటలను రైతులు సాగు చేశారు.
దగాపడుతున్న దొండ రైతులు
దళారుల చేతిలో మోసపోతున్న అన్నదాతలు
నిరుపయోగంగా పీఏపల్లి మండలంలో దొండ మార్కెట్
కలెక్టర్ ఆదేశించినా ముందుకు సాగని వైనం
గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకోలు
దేవరకొండ, ఏప్రిల్ 10: నల్లగొండ జిల్లా పీఏపల్లి, గుర్రంపోడు మండలాలలో 15 వేల ఎకరాలకుపైగా దొండ, మునగ పంటలను రైతులు సాగు చేశారు. ఏఎమ్మార్పీ ఆయకట్టు కింద నీటిని విడుదల చేయకపోవడంతో వరి సాగుపై ఆశలు వదులుకున్న రైతులు ఆరుతడి పంటలైన దొండ, మునగ, ఇతర కూరగాయ ల సాగుపై దృష్టి సారించారు. పీఏపల్లి మండలం కోనమేకలవారిగూడెం, అక్కంపల్లి, రంగారెడ్డిగూడెం, మల్లాపురం, అంగడిపేట గ్రామాల్లో రైతులు 8 నుంచి 9వేల ఎకరాలకు పైగా దొండ పంటలను సాగు చేశా రు. కాని దొండ రైతులకు మార్కెట్ సౌకర్యంలేకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్నారు. పీఏపల్లి మండలం కోనమేకలవారిగూడెం వద్ద అప్పటి ప్రభు త్వం 2016లో దొండ మార్కెట్‌ను రూ.60లక్షలతో ఏర్పాటు చేసింది. కానీ మార్కెట్ సౌకర్యం కల్పించకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో దొండ మార్కెట్ నిరుపయోగంగా మారింది. ఇటీవల రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారికి దొండ మార్కెట్‌ను పునరుద్ధరించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి దొండ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌తో పాటు వ్యవసాయశాఖ అధికారులు కోనమేకలవారిగూడెం దొండ మార్కెట్‌ను సందర్శించారు. రైతులు, మార్కెట్ అధికారులతో స మావేశం ఏర్పాటు చేసి మార్కెట్‌లోనే కొనుగోలు చే యాలని గిట్టుబాటు ధర కల్పిస్తామని నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు మార్కెట్, వ్యవసాయశాఖ అధికారులు స్పందించకపోవడంతో దొండ రైతులు తాము పండించిన పంటలను వ్యాపారులకే అప్పగించి వారు నిర్ణయించినధరకే విక్రయించి నష్టపోతున్నారు.
ఖర్చు లక్షల్లో.. ఆదాయం వందల్లో..
ఎకరాకు దొండసాగు రూ.2.5 లక్షలు ఖర్చు అవుతుంది. ఉద్యానవనశాఖ రూ.60వేలు సబ్సిడీ ఇస్తుంది. 60 రోజుల నుంచి దొండ పంట దిగుబడి వస్తుంది. ప్రస్తు తం దొండకాయలు 50 కేజీల బస్తాకు మార్కెట్‌లో రూ.300 నుంచి 500 వరకు ధర పలుకుతుంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, బోయినపల్లి, వరంగల్, గుంటూరు, మాచర్ల నుంచి రైతులు వాహనాల్లో దొం డ తోటల వద్దకు వచ్చి వారు నిర్ణయించిన ధరకే రైతులనుంచి దొండ కాయలను విక్రయిస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో దళారులు చెప్పిన రేటుకే దొండ పంటలను విక్రయించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మార్కెట్‌లో ఉన్న ధరకు దొండ పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని దొండ రైతులు కోరుతున్నారు.
మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు
కలెక్టర్,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీఏపల్లి మండలం కొనమేకలవారిగూడెంలో దొండ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నాం. వ్యవసాయ,మార్కెటింగ్‌శాఖ అధికారులు, రైతులతో సమా వేశం నిర్వహించాం. త్వరలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
- శ్రీలక్ష్మి, ఏడీఏ, దేవరకొండ