చివరి దశ పనులను వెంటనే పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:34 PM
చివరి దశ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు.

- మెడికల్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణపేట టౌన్, జూన్ 12: చివరి దశ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ప్రిన్సిపాల్ గది, ఎగ్జామినేషన్ హాల్, లెక్చర్ రూమ్, ల్యాబ్‌ల ఏర్పాటు కోసం కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చివరి దశ పనులను మూడు, నాలుగు రోజుల్లో పూర్తిచేయాలన్నారు. ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను వెంటనే కల్పించాలన్నారు. కళాశాల విద్యుత్ కోసం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని, కళాశాల బయట లోపల సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటాలని తెలిపారు. అలాగే బృందావన కాలనీలో కొనసాగుతున్న మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి అంతస్తులో పనులు అసంపూర్తిగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకిషన్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.