Share News

అభ్యంతరకరంగా నేతల భాష

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:40 AM

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయనాయకులు మాట్లాడుతున్న భాష పట్ల మేధావులు, సామాజికవేత్తలు, న్యాయకోవిదులు, కవులు, రచయితలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు వాడే భాష సభ్యంగా ఉండాలని వారంతా

అభ్యంతరకరంగా నేతల భాష

మేధావులు, రచయితల అభిశంసనపత్రం

‘తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిభాష’ పై

హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో రాజకీయనాయకులు మాట్లాడుతున్న భాష పట్ల మేధావులు, సామాజికవేత్తలు, న్యాయకోవిదులు, కవులు, రచయితలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు వాడే భాష సభ్యంగా ఉండాలని వారంతా అభిప్రాయపడ్డారు. ‘తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిభాష’ అంశంపై.. మాదాపూర్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్నవారంతా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు వాడుతున్న భాషను నిరసిస్తూ, అభిశంసన పత్రాన్ని విడుదల చేశారు. నాయకుల ప్రసంగాలు, చర్చాగోష్ఠుల్లో పరస్పర నిందలు ప్రధానం కావడం బాధాకరమన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారి కుటుంబ సభ్యులను కూడా దుర్భాషలాడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సభ్యత, బాధ్యత కలిగిన పౌరులంతా ఈ తరహా అసభ్యకరమైన భాషను అభిశంసించాలని కోరారు. సంస్కార రహితంగా ఎవరు మాట్లాడినా, వారిపై నిరసనలు తెలియజేస్తామని ప్రకటించారు. పత్రికలు, చానళ్లు కూడా నాయకుల అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేయకూడదని.. ప్రచురణకు స్వీకరించకుండా బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే అన్ని మీడియా కార్యాలయాలకూ త్వరలోనే లేఖలు రాయనున్నట్లు తెలిపారు. పరస్పర గౌరవంతో ఆరోగ్యకరమైన చర్చజరగాల్సిన ప్రజాస్వామ్య దేశంలో తిట్లదండకాలకు చోటు ఉండకూడదని ఆకాంక్షించారు. దుర్భాషలాడుకొనే కుసంస్కృతికి వ్యతిరేకంగా పౌర స్పృహను పెంచేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోడ రఘురాం, విశ్రాంత ఐఏఎ్‌సలు కాకి మాధవరావు, సుజాతారావు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సామాజిక కార్యకర్త సుధ గోపరాజు, ప్రముఖ కవులు కె.శివారెడ్డి, అందెశ్రీ, ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్టులు వల్లీశ్వర్‌, కె.శ్రీనివాసరెడ్డి, మాశర్మ, డానీ, ఎమెస్కో విజయ్‌ కుమార్‌, ప్రముఖ రచయిత డి.చంద్రశేఖర్‌ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, మాడభూషి శ్రీధర్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, విశ్లేషకుడు తెలకపల్లి రవి పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 02:40 AM