Share News

ఎండలు బాబోయ్‌.. ఎండలు!

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:05 AM

భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా

ఎండలు బాబోయ్‌.. ఎండలు!

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు

చాలాచోట్ల 44 డిగ్రీలపైనే

సాయంత్రం కొన్ని జిల్లాల్లో జల్లులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండల కేంద్రంలో అత్యధికంగా 45.2 డిగ్రీలుగా నమోదైంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు, మంచిర్యాల జిల్లా కొమ్మెరలో 45, పెద్దపల్లి జిల్లా కల్వచర్ల, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 44.9, సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 44.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా జిల్లాల్లో 44 డిగ్రీలకు పైనే ఎండలు కాశాయి. ఈ నేపథ్యంలోనే పలు మండలాల్లో రెడ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేశారు. ఇక సాయంత్రానికి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడటంతో వాతావరణం చల్లబడింది. నాగారం, దమ్మాయిగూడ మునిసిపాలిటీల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం నల్లవెల్లిలో రైతు కావలి నీలకంఠం (32) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వర్షం పడుతుండటంతో ఇంటి వెనక ఆరబోసిన ధాన్యం తడవకుండా టార్ఫాలిన్‌ కప్పేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.

వడదెబ్బకు ఆరుగురి మృతి..

ఎండల వేడిమి తాళలేక వడదెబ్బ తగిలి వివిధ జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మట్కం గంగారం (42), గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కావలి వెంకటమ్మ (62), భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం చింతోనిచెలకకు చెందిన సూర్నపాక లక్ష్మయ్య (48), యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో ఏపీకి చెందిన కూలీ అలగంజి నాగరాజు (50), నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లికి చెందిన కొత్తూరు గోపి (41), మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన షేక్‌ ఫరీద్‌ పాషా (40) ఎండలకు అస్వస్థత చెంది మరణించారు. ఇటు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండటం చిల్లేపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు వడగాలులకు అస్వస్థతకు గురయ్యారు.

Updated Date - Apr 19 , 2024 | 05:05 AM