Share News

గుండె రంధ్రం పూడ్చలేని పేదరికం బాలుడిని బలిగొంది!

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:48 AM

శస్త్రచికిత్స చేస్తే ప్రాణాంతకమైన అనారోగ్యం నుంచి ఆ బాలుడు స్వస్థత పొందుతాడని తెలిసినా ఖరీదైన ఆ వైద్యం చేయించలేని తల్లిదండ్రుల పేదరికం చివరికి అ చిన్నారి ప్రాణం తీసింది. పుస్తకాల

గుండె రంధ్రం పూడ్చలేని పేదరికం బాలుడిని బలిగొంది!

బడి ఆవరణలో గుండెపోటుతో మృతి.. సిరిసిల్ల జిల్లాలో విషాదం

శస్త్రచికిత్స తప్పనిసరి అని తెలిసినా వైద్యం చేయించలేని దైన్యం

ఇల్లంతకుంట, మార్చి 26: శస్త్రచికిత్స చేస్తే ప్రాణాంతకమైన అనారోగ్యం నుంచి ఆ బాలుడు స్వస్థత పొందుతాడని తెలిసినా ఖరీదైన ఆ వైద్యం చేయించలేని తల్లిదండ్రుల పేదరికం చివరికి అ చిన్నారి ప్రాణం తీసింది. పుస్తకాల సంచీతో బడికి వెళ్లిన ఆ బాలుడు పాఠశాల ఆవరణలోనే తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. మృతుడు 14 ఏళ్ల విద్యార్థి సాయితేజ. నర్సక్కపేటకు చెందిన శ్రీనివాస్‌, రేణుక దంపతుల ఇద్దరు సంతానంలో సాయితేజ పెద్ద కుమారుడు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నర్సక్కపేట నుంచి అదే మండలంలోని కందికట్కూర్‌కు వచ్చేశారు. శ్రీనివాస్‌ దంపతులు కూలీ పనులకు వెళుతుంటారు. సాయితేజ, అతడి సోదరుడు అదే ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సాయితేజకు పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉంది. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పినా ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో సాయితేజకు శ్రీనివాస్‌, రేణుక దంపతులు వైద్యం చేయించలేకపోయారు. రోజూలాగే మంగళవారం పాఠశాలకు వెళ్లిన సాయితేజ భోజనం చేసిన కొద్దిసేపటికి వాష్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి బయలుదేరి కుప్పకూలాడు. వెంటనే బాలుడిని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించిన దంపతులు తమ మరో కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 04:48 AM