Share News

Manchiryāla- పేదల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:35 PM

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకొని మంత్రి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు

Manchiryāla-   పేదల అభివృద్ధే లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి సీతక్క

మంచిర్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకొని మంత్రి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లాంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేరని అన్నారు. ఉమ్మడి జిల్లాలో కనీసం మంచినీళ్లు కూడా లేని గ్రామాలు ఉండడం బాధాకరమన్నారు. జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. వందలాది గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు లేని కారణంగా పౌష్టికారం అందించలేదని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాణహిత-చేవెళ్ల లాంటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. తమకు ఆదాయం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, రోడ్డు రవాణా, తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆడవాళ్లలో ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా ఉండడంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని వారు అర్థం చేసుకున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం కోసం ప్రజల సెంటిమెంటును వాడుకున్నారని, సెంటిమెంటును రగిలించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే కూడా ఓర్వలేదని విమర్శించారు. స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు ఇస్తే సైతం బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీల గడ్డ అయిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమించడం తన అధృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు, మీడియా సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన తొలి బహిరంగ సభను ఇంద్రవెళ్లిలో ఏర్పాటు చేశారని చెప్పారు. సీఎం అయ్యాక మళ్లీ అక్కడనే బహిరంగ సభ ఏర్పాటు చేయ డం ఉమ్మడి ఆదిలాబాద్‌పై ఆయనకున్న అభిమానాన్ని చాటుతోందన్నారు. సీఎల్పీ లీడర్‌గా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూడా తన పాదయాత్రను ఇంద్రవెళ్లి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల జీవనశైలిపై అవగాహన ఉన్న మంత్రి సీతక్కను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంద్రవెల్లి సీఎం సభ ఏర్పాట్లు తన భుజస్కందాలపై పెట్టడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ రాకముందే మంచిర్యాల జిల్లాలో కూడా సీఎం బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నానని తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఏఐటీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌, సీనియర్‌ కౌన్సిలర్‌ రావుల ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 10:35 PM