Share News

కుండపోత

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:07 AM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము నుంచి పలు చోట్ల కుండపోతగా వాన పడింది.

కుండపోత

-ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన

-జలమయమైన లోతట్టు ప్రాంతాలు

-సరూర్‌నగర్‌లో అత్యధికంగా 149.1మి.మీ వర్షపాతం నమోదు

-వరద ప్రవాహానికి మేడికుంట కట్టకు గండి

-పొంగి ప్రవహించిన వాగులు, వంకలు

-వికారాబాద్‌ జిల్లాలో దెబ్బతిన్న పంటలు

-నిండుగా ప్రవహిస్తున్న మూసీ నది

-మదనపల్లిలో తెగిన చెక్‌ డ్యామ్‌.. ఇళ్లలోకి వరద నీరు

-పొంగిపొర్లిన దోర్నాల్‌ వాగు... నిలిచిపోయిన రాకపోకలు

వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి)/ రంగారెడ్డి అర్బన్‌, మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి) ఆగస్టు 20: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము నుంచి పలు చోట్ల కుండపోతగా వాన పడింది. ఈసీ, మూసీ నదులు ఉప్పొంగాయి. దీంతో హైదరాబాద్‌కు తాగునీరు అందించే హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు భారీగా వరదనీరు చేరుతోంది. ఈ సీజన్‌లో ఇదే అతిపెద్ద వర్షంగా చెప్పవచ్చు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. చెక్‌డ్యాంలు అలుగు పారాయి. ప్రధాన మార్గాలు, కాలనీలు, తోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని నగర శివార్లలోని పలు కాలనీలు నీట మునిగాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు బిల్డింగ్‌ వద్ద రికార్డు స్థాయిలో 149.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో 140 మి.మీ, ఉప్పల్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ వద్ద 135.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 98.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితుల అనుకూలించక ఇప్పటికే పలు మండలాల్లో ఆశించిన స్థాయిలో పంటలు సాగు జరగలేదు. ఇపుడు కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కొన్ని పంటలకు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా కూరగాయ, ఉద్యాన పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది.

గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం

రంగారెడ్డి జిల్లా..

మండలం ప్రాంతం నమోదు (మి.మీ)

సరూర్‌నగర్‌ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు బిల్డింగ్‌ 149.1

రాజేంద్రనగర్‌ రాజేంద్రనగర్‌ (ఏఆర్‌ఎస్‌) 125.0

సరూర్‌నగర్‌ ఎల్బీనగర్‌ (జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌) 125.3

రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ ఆఫీస్‌ 106.0

సరూర్‌నగర్‌ అలకపూరి కమ్యూనిటీ హాల్‌ 104.3

రాజేంద్రనగర్‌ శివరాంపల్లి 93.8

సరూర్‌నగర్‌ రాక్‌టౌన్‌ కాలనీ 90.0

రాజేంద్రనగర్‌ శాస్ర్తీపురం 81.8

రాజేంద్రనగర్‌ లింగోజిగూడ 80.0

మేడ్చల్‌ జిల్లా..

బాల్‌నగర్‌ పతేనగర్‌ 140.3

ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ 135.0

ఉప్పల్‌ న్యూ నాగోల్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ 124.6

కాప్రా ఈఎస్‌ఎస్‌ మల్కారం 115.0

ఉప్పల్‌ మారుతి నగర్‌ 105.5

కుత్బుల్లాపూర్‌ వార్డు ఆఫీస్‌, గాయత్రీనగర్‌ 138.0

మేడ్చల్‌ ఇండస్ర్టియల్‌ ఏరియా 96.8

కుత్బూల్లాపూర్‌ ఈఎస్‌ఎస్‌ జీడిమెట్ల 93.5

మల్కాజిగిరి వినాయకనగర్‌ 77.5

వికారాబాద్‌ జిల్లా..

వికారాబాద్‌ మర్పల్లి 98.3

యాలాల్‌ యాలాల్‌ 71.3

కుల్కచర్ల ముజాహిత్‌పూర్‌ 66.8

దోమ దోమ 66.0

వికారాబాద్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. వికారాబాద్‌, యాలాల్‌, కులకచర్ల, దోమ, కొడంగల్‌, పూడూరు, కోట్‌పల్లి, పరిగి మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రెండు నుంచి మూడు గంటల పాటు కురిసిన ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వికారాబాద్‌ మండలంలో మైలార్‌దేవరంపల్లి, కోట్‌పల్లి మండలం, జిన్నారం గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహించడంతో పక్కనే ఉన్న పంటలు నీట మునిగాయి. పత్తి, పసుపు పంటలతో పాటు వివిధ కూరగాయల పంటలు, పూల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రెండు గ్రామాల్లోనే 500 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. కాగా, భారీ వర్షానికి క్షేత్ర స్థాయిలో జరిగిన పంట నష్టం మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. వికారాబాద్‌ మండలంలో కురిసిన వర్షానికి మదన్‌పల్లిలో చెక్‌డ్యాం కట్ట తెగి గ్రామంలోకి భారీగా వరద నీరు చేరింది. గ్రామంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. గిరిగెట్‌పల్లి వాగు పొంగి ప్రవహించడంతో రైల్వే బిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వికారాబాద్‌ - గిరిగెట్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కురిసిన వర్షానికి చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది.

నీట మునిగిన పంట పొలాలు

భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జిన్నారం, మైలార్‌దేవరంపల్లి గ్రామాల పరీవాహక ప్రాంతాల్లో పంట పొలాలు జలమయమయ్యాయి. ఎదుగుతున్న పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి పంటలు చేతికి వస్తాయని ఆశపడితే కురిసిన భారీ వర్షం ఆశలు గల్లంతు చేసిందంటూ బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇళ్లలోకి వరద నీరు

వికారాబాద్‌/ధారూరు/బంట్వారం (కోట్‌పల్లి)/యాలాల/నవాబుపేట : మదనపల్లిలో గుట్టపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో చెక్‌డ్యామ్‌ కట్ట తెగిపోయింది. దీంతో వరద నీరు ఇండ్లలోకి చేరింది. సామగ్రి నీటిలో తడిసిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్‌ ధారూరు, దోర్నాల్‌ గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగిపొర్లి తాత్కలిక వంతెన పై నుంచి ప్రవహించింది. దీంతో నాగారం, దోర్నాల్‌ గ్రామాల వైపు నుంచి ధారూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కోట్‌పల్లి మండల పరిధిలోని జిన్నారం నాగసాన్‌పల్లి, కంకణాలపల్లి ఎన్నారం తదితర గ్రామాల్లో వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. పత్తి, అరటి, కంది, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు సందర్శించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. యాలాల మండలంలో భారీ వర్షంతో చెరువు కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షానికి రాఘవపూర్‌ చెరువు నిండి అలుగు పారింది. రాఘవపూర్‌, విశ్వనాథ్‌పూర్‌, సంగెంకుర్ధు గ్రామాల పరిధిలోని కొన్ని పంట పొలాల్లో వర్షం నీరు నిలిచి పంటలు దెబ్బతిన్నాయి. నవాబుపేట మండలంలోని మూసీ నదిలో వరద నీరు భారీగా చేరడంతో చంచల్‌పేట్‌, అక్నాపూర్‌, అత్తాపూర్‌, నారేగూడ, గంగ్యాడ, ముబారక్‌ పూర్‌, గుబ్బడి ఫతేపూర్‌ గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది.

అనంతగిరిలో వాటర్‌ ఫాల్స్‌ కనువిందు

వికారాబాద్‌ : కురుస్తున్న భారీ వర్షాలతో అనంతగిరి పచ్చదనంతో కనువిందు చేస్తుంది. నందిఘాట్‌ నుంచి లోపలికి వెళ్లే మార్గంలో వాటర్‌ ఫాల్స్‌ వచ్చాయన్న విషయం తెలుసుకున్న స్థానికులు, పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుతున్నారు. వాటర్‌ ఫాల్స్‌ వెళ్లే మార్గం ప్రమాదకరంగా ఉండడంతో అటువైపు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మేడ్చల్‌ జిల్లాలో.

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి)/మేడ్చల్‌ టౌన్‌/కీసర రూరల్‌ : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. కాలనీల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో పలు కాలనీలోని సెల్లార్‌లలోకి, రోడ్లపైకి వరద నీరు వచ్చింది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. మేడ్చల్‌లోని సుతారిగూడ, గుండ్లపోచంపల్లి చెరువులతో పాటు మండలంలోని పలు చెరువుల్లో వర్షం నీరు చేరింది. ఎగువన ఉన్న దమ్మాయిగూడ నుంచి వరద పోటెత్తడంతో నాగారంలోని పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా కీసర నుంచి కుషాయిగూడకు వెళ్లే దారిలో దాదాపు రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగారం మున్సిపాలిటీలోని లోతట్టు కాలనీలైన బీఎంఆర్‌ ఎన్‌క్లేవ్‌, సాయినగర్‌ కాలనీల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి, మన్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌కుమార్‌ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.

నిండుకుండలా గొర్లకుంట చెరువు

కడ్తాల్‌, ఆగస్టు 20: కడ్తాల్‌ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. కడ్తాల్‌ సమీపంలోని గొర్లకుంటలోకి భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది. మేడికుంటలోకి పెద్ద ఎత్తున చేరుతుండడంతో నీటి ప్రవాహానికి కుంట కట్టకు గండి పడింది. దీంతో పెద్ద ఎత్తున గండి నుంచి నీరు వృథాగా పోతుంది. గండిని వెంటనే పూడ్చి నీరు వృథా కాకుండా చూడాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. కుంట కట్టను పరిశీలించిన వారిలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీచ్యనాయక్‌, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మనాయక్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ చేగూరి వెంకటేశ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాంచందర్‌నాయక్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌ బాబా, జహంగీర్‌అలీ, గూడెపు జంగయ్య, రవి, తదితరులు ఉన్నారు.

చెరువును తలపిస్తున్న రోడ్లు

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోనూ సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. ఏపీజీబీవీ ఎదుట హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయరహదారిపై వర్షం నీరు చేరడంతో చెరువును తలపించింది.

ఉప్పొంగిన మూసీ

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీతో పాటుగా మండలంలో మంగళవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. సుమారు 9సెం.మీల వర్షం కురిసింది. వికారాబాద్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం కురవడంతో మూసీ వాగు ఈసీజన్‌లో మొదటి సారిగా ఉప్పొంగింది. ఈ వర్షంతో పంటలకు జీవం వచ్చినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. టంగటూరు ఉన్నత పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరడంతో అది చెరువును తలపించింది.

చెరువులను తలపించిన రోడ్లు

ఇబ్రహీంపట్నం :ఇబ్రహీంపట్నం టౌన్‌ సహా పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం గంటపాటు దంచికొట్టడంతో రోడ్లు చెరువును తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

అలుగు పారుతున్న నాయినివాని చెరువు

కందుకూరు: మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం తెల్లవారు జాము నుంచే వాన దంచి కొట్టింది. దీంతో ధన్నారం, పులిమామిడి, జైత్వారం గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. నాయినివాని చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. అలాగు కొత్తగూడ గ్రామలోని సున్నం చెరువులోకి వరద నీరు చేరుతోంది.

Updated Date - Aug 21 , 2024 | 12:24 AM