Share News

తుది దశకు మల్టీ-లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:58 AM

నాంపల్లిలో నిర్మిస్తున్న మల్టీ-లెవల్‌ పార్కింగ్‌(ఎంఎల్‌పీ) త్వరలో అందుబాటులోకి రానుంది. 15 అంతస్తుల్లో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది.

తుది దశకు మల్టీ-లెవల్‌  పార్కింగ్‌ కాంప్లెక్స్‌

ఏకకాలంలో 250 కార్లు, 200 మోటార్‌సైకిళ్ల పార్కింగ్‌.. నాంపల్లిలో 15 అంతస్తుల్లో 80 కోట్లతో నిర్మాణం

అందులోనే కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, థియేటర్లు

దేశంలోనే తొలిసారిగా.. జర్మన్‌ పాలిస్‌ పార్కింగ్‌ విధానం

లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రారంభించే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): నాంపల్లిలో నిర్మిస్తున్న మల్టీ-లెవల్‌ పార్కింగ్‌(ఎంఎల్‌పీ) త్వరలో అందుబాటులోకి రానుంది. 15 అంతస్తుల్లో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. దేశంలోనే జర్మన్‌ పాలిస్‌ పార్కింగ్‌ విధానంలో నిర్మించిన ఎంఎల్‌పీ ఇదే కావడం గమనార్హం.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తెలియనిది కాదు. ఇక పార్కింగ్‌ కోసం కీలక కూడళ్లలో అగచాట్లు పడాల్సిందే. మల్టీ-లెవల్‌ పార్కింగ్‌ అంశం దశాబ్దన్నర క్రితమే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీగా ఉన్న ఎన్‌వీఎ్‌స రెడ్డి.. అప్పట్లో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఈ అంశంపై అధ్యయనం చేశారు. కానీ, 2018 వరకు కూడా ఈ అంశం కార్యరూపు దాల్చలేదు. నాంపల్లి మెట్రో స్టేషన్‌ సమీపంలో హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సంస్థకు ఉన్న అర ఎకరం స్థలంలో 2018లో ఎంఎల్‌పీకి శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్ధతిలో రూ.80 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. కొవిడ్‌ కాలంలో పనులు కాస్త నెమ్మదిగా సాగినా.. జర్మన్‌ పాలిస్‌ విధానం ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను పార్క్‌ చేసేలా 15 అంతస్తుల నిర్మాణం తుది దశకు చేరుకుంది. వీటిలో ఐదంతస్తుల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, రెండు స్ర్కీన్‌లతో థియేటర్లు ఉంటాయి. 10 అంతస్తులను పార్కింగ్‌కు కేటాయిస్తారు. మొత్తం 1.04 లక్షల చదరపు అడుగుల స్థలంలో.. 68ు పార్కింగ్‌కు.. 32ు వాణిజ్య సముదాయాలకు కేటాయిస్తారు. ఈ కాంప్లెక్స్‌లో ఏకకాలంలో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలను పార్క్‌ చేయవచ్చు. ఈ విధానం విజయవంతమైతే.. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఎంఎల్‌పీలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కాంప్లెక్స్‌ పనులను మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎ్‌స రెడ్డి ఆదివారం పరిశీలించారు. నెలరోజుల్లో ట్రయల్‌ రన్‌ ప్రారంభించాలని డెవలపర్లను ఆయన కోరారు.

ప్రత్యేకతలివే..!

  • నాంపల్లి ఎంఎల్‌పీలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నాలుగు(ఎగ్జిట్‌/ఎంట్రీ) టెర్మినల్స్‌ ఉంటాయి.

  • టెర్మినల్స్‌ వద్ద వాహనాలను ఆపేందుకు ‘టర్న్‌ టేబుల్స్‌’ ఉంటాయి. వాహనాలను ఈ టేబుల్‌పై వదిలితే.. వాటిని లిఫ్టుల ద్వారా నిర్ణీత అంతస్తులో పార్కింగ్‌ చేస్తారు.

  • కంప్యూటరైజ్డ్‌ స్కానర్లు వాహనం కొలతను బట్టి స్లాట్లను ఇస్తాయి. ఎస్‌యూవీ, సెడాన్‌ లాంటి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలుంటాయి.

  • వాహనదారులకు ఆర్‌ఎ్‌ఫఐడీ స్మార్ట్‌కార్డులుంటాయి. వారు ఎప్పుడు వాహనాన్ని పార్క్‌ చేశారు? వాహనం ఎంత సమయం.. ఏ టెర్మినల్‌లో పార్కింగ్‌లో ఉంది? ఎప్పుడు బయటకు వెళ్తోంది? అనే వివరాలను సులభంగా గుర్తిస్తారు.

  • నగదు చెల్లించి కూడా వాహనాలను పార్క్‌ చేసుకోవచ్చు.

  • వాహనదారులు కార్లను తిరిగి తీసుకునేప్పుడు రివర్స్‌ తీసుకునే అవసరం లేకుండా.. ‘టర్న్‌ టేబుల్స్‌’ వాహనాన్ని కావాల్సిన దిక్కుకు రొటేట్‌ చేస్తాయి.

  • మొత్తమ్మీద వాహనాన్ని పార్క్‌ చేసేందుకు ఒక నిమిషం, తిరిగి తీసుకునేందుకు 2నిమిషాలు పడుతుందని అంచనా.

Updated Date - Apr 22 , 2024 | 04:58 AM