నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:24 AM
చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన బాధిత భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలోనే నష్టపరిహారం చెల్లించి రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ. శ్యాంసుందర్‌రావు డిమాండ్ చేశారు.

యాదాద్రిభువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు
మర్రిగూడ, జనవరి 11: చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన బాధిత భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలోనే నష్టపరిహారం చెల్లించి రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ. శ్యాంసుందర్‌రావు డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడెం ప్రాజెక్టు కట్ట పనులను గురువారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అసమర్థతతో రిజర్వాయర్ పనులు తొమ్మిది సంవత్సరాలైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. 2015లో చర్లగూడెం శంకుస్థాపన సందర్భంగా రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఉన్న రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ పూర్తిగా విఫలమైందన్నారు. అదేవిధంగా శంకుస్థాపన సందర్భంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన భూనిర్వాసితులకు ముంపు గ్రామాల బాధిత నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, నష్ట భూపరిహారం, పునరావసం కల్పిస్తానని చెప్పినా నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండాల్లోని కొంతమంది అర్హులైన బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహారం అందివ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుతాన్ని ప్రజలు నమ్మి అఽధికారం చేతులో పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్ తరహాలోనే త్వరగా నష్టపరిహారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ ప్రాజెక్టును పరిశీలించి భూ నిర్వాసితులకు పరిహారం అందేవిధంగా చూసి త్వరగా పనులు పూర్తి అయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితుల సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శివన్నగూడ సర్పంచ్ చిట్యాల సబితయాదగిరిరెడ్డి, బీజేపీ నాయకులు దాసరి మల్లేష్, కర్నాటి ధునుంజ్‌రెడ్డి, పిట్టల అశోక్, పిట్టల శ్రీనివాస్, యాస అమరేందర్‌రెడ్డి, రాజేందర్‌నాయక్, రాజు, పరమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.