Share News

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది.. ప్రజాప్రతినిధులు సహకరించాలి

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:12 PM

రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా పార్లమెంట్‌ ఎన్నికల వైపు దృష్ఠి సారిస్తుండగా ఊహించని విధంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటూ కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది.. ప్రజాప్రతినిధులు సహకరించాలి
మాట్లాడుతున్న జిల్లా కలెకట్ర్‌ శశాంక

సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ శశాంక

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 28 : రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా పార్లమెంట్‌ ఎన్నికల వైపు దృష్ఠి సారిస్తుండగా ఊహించని విధంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటూ కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఈ స్థానానికి మార్చి 28న ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ శశాంక బుధవారం కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ అన్నారు. ఈ నెల 26వ తేదీన మహబుబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసినట్లు చెప్పారు. అదే రోజు నుండి ఎన్నికల కోడ్‌ వర్తింస్తుందన్నారు. ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ మార్చి 4న ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్‌ విడుదలతో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి పరిధిలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ తక్షణం అమలులోకి వచ్చిందని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్లకు తుది గడువు మార్చి 11, మార్చి 12న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 తుది గడువు, మార్చి 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌, ఏప్రిల్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏప్రిల్‌ 4వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కలెక్టర్‌ తెలిపారు.

పది మండలాల్లో 171 మంది ఓటర్లు..

జిల్లాలో పది మండలాలకు (అమనగల్‌, ఫరూఖ్‌నగర్‌, కేశంపేట్‌, కొందుర్గు, కొత్తూరు, మాడ్గుల, తలకొండపల్లి, చౌదరిగూడెం, నందిగామ, కడ్తాల్‌) సంబంధించి 171 మంది ఓటర్లు ఉన్నారు. షాద్‌నగర్‌లోని ఎంపీపీ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ శశాంక తెలిపారు.

జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్‌..

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌ శశాంక తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) నిబంధనలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సర్విలియాన్‌ టీంల బాధ్యతలను తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని, కోడ్‌ ఉల్లంఘించకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. జిల్లాలో ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్టీల టీములను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, జహంగీర్‌ ఖాన్‌, సాయితేజ (కాంగ్రెస్‌), ఎన్‌.జగదీశ్వర్‌ (బీఆర్‌ఎస్‌)తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సందడి

ఆమనగల్లు: మహబూబ్‌నగ ర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో కల్వకుర్తి నియోజకరవ్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆమనగల్లు మున్సిపాలిటీ, మండలంలో 21 ఓట్లు , మాడ్గుల మండలంలో 15, తలకొండపల్లి మండలంలో 13, కడ్తాల మండలంలో 11, కల్వకుర్తి మున్సిపాలిటీ, మండలంలో 35, వెల్దండ మండలంలో 13 ఓట్లున్నాయి. ఓటర్లలో ఆరుగురు జడ్పీటీసీ సభ్యులు, 37 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు, 64 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి పలువురు నాయకులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా కల్వకుర్తి నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు బీఆర్‌ఎస్‌కే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రస్థాయిలో ఉండేటట్లు కన్పిస్తుంది. తమ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు సంతోషంగా ఉన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 10:12 PM