Share News

బస్సును ఢీకొట్టి డీసీఎం బోల్తా

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:39 AM

మూగ జీవాలను తరలిస్తున్న డీసీఎం బోల్తా పడటంతో తొమ్మిది గోవులు మృతిచెందగా, ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి.

బస్సును ఢీకొట్టి డీసీఎం బోల్తా
బస్సును ఢీకొట్టడంతో నుజ్జయిన డీసీఎం కేబిన్‌ భాగం

వాహనంలో తరలిస్తున్న 9 గోవులు మృతి

సామూహిక ఖననం చేసిన పోలీసులు

సజీవంగా ఉన్న జీవాలు గోశాలకు తరలింపు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ప్రమాదం

నార్కట్‌పల్లి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మూగ జీవాలను తరలిస్తున్న డీసీఎం బోల్తా పడటంతో తొమ్మిది గోవులు మృతిచెందగా, ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన సుమారు 40 గోవులను (9 ఆవులు, 31 కోడెలు) టీజీ 07 యూ 2606 నెంబర్‌ గల డీసీఎంలో హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో నార్కట్‌పల్లి మండల కేంద్రానికి సమీపంలోని పూజిత హోటల్‌ వద్దకు చేరుకుంది. ఆ ప్రదేశంలో రోడ్డు పక్కన నిలిపిఉంచిన మియాపూర్‌-1 డిపో బస్సును వేగంగా వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం రోడ్డుపై బోల్తా కొట్టడంతో అందులో తరలిస్తున్న 40 జీవాలు ఒకదానిపై ఒకటి పడి ఊపిరాడక 2 ఆవులు, 7 ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. కొన్ని గోవులు బెదిరి పరుగు లంఘించాయి. ప్రమాద సమాచారం అందుకున్న బీజేపీతో పాటు హైందవ సంఘాలకు చెందిన నాయకులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఎక్స్‌కవేటర్‌ను తెప్పించి డీసీఎంలో ఇరుక్కున్న గోవులను స్థానిక యువకుల సహకారంతో వెలికితీశారు. తొమ్మిది జీవాల కళేబరాలకు పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నార్కట్‌పల్లిలోనే సామూహిక ఖననం చేశారు. గాయపడిన వాటికి వెటర్నరీ వైద్యునితో చికిత్స చేయించి మాడ్గులపల్లి మండలం చెర్వుపల్లిలోని జై జనార్థన గోసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు తరలించారు. ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్‌ గోపాల్‌ పరారీ కాగా అందులో సహాయకులుగా ఉన్న ఇద్దరు కూలీలు గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. నార్కట్‌పల్లి సీఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గోవులను గోశాలకు తరలించడంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొర్వి శంకర్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన యువకులు పోలీసులకు సహకరించారు.

Updated Date - Oct 21 , 2024 | 12:39 AM