Share News

కులగణనను వెంటనే ప్రారంభించాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:46 PM

రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించి తమ హామీని నిలబెట్టుకోవాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు.

కులగణనను వెంటనే ప్రారంభించాలి
మాట్లాడుతున్న భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీసీ సంక్షేమానికి ఏటా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి

బీసీ ఉద్యమంలో వికారాబాద్‌ జిల్లా అగ్రస్థానంలో ఉండాలి

భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వికారాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించి తమ హామీని నిలబెట్టుకోవాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బీసీ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌ ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్‌లోని నర్సింగ్‌ గౌలీకార్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే బీసీ సంక్షేమానికి ప్రతిఏటా రూ.20 వేల కోట్ల వంతున ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్‌... తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. జీవాల లెక్కింపు చేస్తున్న ప్రభుత్వం ..,.మనుషులు ఎంత మంది ఉన్నారనేది గుర్తించేందుకు కులగణన చేపట్టేందుకు ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. బీసీల హక్కులకు ప్రతీకగా భావించే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వచ్చే ఏప్రిల్‌ 11వ తేదీలోగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసేలా సానుకూల ప్రకటన చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అదే నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బీసీలకు బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించేలా, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేసేలా, కులగణన వెంటనే చేపట్టేలా వికారాబాద్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, సీఎం రేవంత్‌రెడ్డిపై బీసీలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీల కోసం చేపట్టిన ఉద్యమానికి వికారాబాద్‌ జిల్లా నాంది కావాలని, ఉద్యమంలో జిల్లా అగ్రస్థానంలో ఉండాలని అన్నారు. ముస్లిం మంత్రి లేని కేబినెట్‌ ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌ కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా బీసీలను ఐక్యం చేసి హక్కులను సాధించుకునేందుకే యుపీఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. ఈ సందర్భంగా బీసీ, కుల సంఘాల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూపీఎఫ్‌ కో కన్వీనర్‌ శివశంకర్‌, టీఎ్‌సఈడబ్ల్యుఐడీసీ మాజీ చైర్మన్‌ జి.నాగేందర్‌గౌడ్‌, ఎంబీసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌, పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, నాయకులు దత్తాత్రేయ, కోల శ్రీనివాస్‌, నరేష్‌, రాజుగౌడ్‌, బిక్షపతి, బీఆర్‌ శేఖర్‌, వెంకటేశం, గోపాల్‌, రవికుమార్‌, ఉమాశేఖర్‌, శ్రీనివాసాచారి, శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సమావేశానికి ముందు ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ ఇంటికి వెళ్లగా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. పార్టీ నాయకులను పరిచయం చేశారు.

Updated Date - Feb 07 , 2024 | 11:46 PM