అన్నదాతకు చినుకు భయం
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:44 AM
పంట వేసింది మొదలు చేతికొచ్చే వరకు అన్నదాత లకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రధానంగా పంట కోత దశలో అకాల వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
- కల్లాల వద్దే ధాన్యం విక్రయాలు
- క్వింటాల్‌కు రూ.1800 నుంచి రూ.2130 వరకు ధర
- బురద పొలాల్లో పంట కోత భారం
- వానాకాలం సాగులో వరి 1.80 లక్షల ఎకరాలు
- దిగుబడి అంచనా 4.37 లక్షల మెట్రిక్ టన్నులు
- 248 కొనుగోలు కేంద్రాలకు 69 ప్రారంభం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పంట వేసింది మొదలు చేతికొచ్చే వరకు అన్నదాత లకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రధానంగా పంట కోత దశలో అకాల వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్ వరికోతలు ప్రారంభమయ్యాయి. కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన కలిగిస్తున్నాయి. బురదపొలాల్లో పంట కోత ఆర్థిక భారాన్ని పెంచుతోంది. ధాన్యం ఆరబెడితే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో మద్దతు ధర కంటే తక్కువకే మిల్లర్లు, మధ్య వ్యాపారులకు నేరుగా ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో వేగం పెంచకపోవడం, కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు తలెత్తడం, కొనుగోళ్లలో తేమ పేరుతో కొరివి పెట్టడం వంటివి దృష్టిలో పెట్టుకున్న రైతులు జిల్లాలో కల్లాల వద్దనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. నేరుగా మిల్లర్లు, వ్యాపారులు, కల్లాల వద్దకు వచ్చి తూకం వేసి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2320 నిర్ణయించారు. రైతులు మాత్రం తేమతో సంబంఽధం లేకుండా పచ్చి ధాన్యం క్వింటాల్‌కు రూ.1800లకు విక్రయిస్తే ఆరబెట్టిన ధాన్యం రూ.2130 వరకు అమ్ముతున్నారు. కల్లాల వద్ద నేరుగా అమ్మడం ద్వారా రవాణా ఇబ్బందులు లేకపోగా ప్రధానంగా కొనుగోలు కేంద్రాల వద్ద 40 కిలోల బస్తా ధాన్యానికి రెండు కిలోల తరుగు తీస్తే కల్లాల వద్ద వ్యాపారులు 70 కిలోలకు 2 కిలోల తరుగు తీస్తున్నారు. వ్యాపారులు కల్లాల వద్దనే రైతులకు సగం వరకు డబ్బులు చెల్లిస్తున్నారు. మిగతా డబ్బులు వారం రోజుల్లోనే ఇచ్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండడం టార్పాలిన్‌ల కోరతలు, ధాన్యం రవాణా, మిల్లర్ల కొర్రీలు, వంటి సమస్యలతో రైతులు ఈ సారి నేరుగా మిల్లర్లకే అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
బురద పొలాల్లో ఇబ్బందులు
జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గంభీరావుపేటలో 18,800 ఎకరాలు, ఇల్లంతకుంట 24 వేలు, ముస్తాబాద్ 22 వేలు, సిరిసిల్ల 4550, తంగళ్లపల్లి 19 వేలు, వీర్నపల్లి 6800, ఎల్లారెడ్డిపేట 16,950, బోయినపల్లి 13 వేలు, చందుర్తి 15,500, కోనరావుపేట 17,850, రుద్రంగి 5,500, వేములవాడ 5200, వేములవాడ రూరల్‌లో 11,150 ఎకరాల్లో వరి వేశారు. వరి కోతలు 15 రోజులుగా కొనసాగుతున్న క్రమంలోనే అల్పపీడనప్రభావంతో పంట నేలవాలింది. బురద పొలాలు కావడంతో చైన్ సిస్టమ్ హార్వేస్టర్లతో మాత్రమే కోతలు సాధ్యమవుతాయి. దీంతో హార్వేస్టర్ల అద్దె ధర పెరిగిపోయింది. గతంలో గంటకు రూ.2800 నుంచి రూ.3 వేలవరకు ఉండగా ప్రస్తుతం రూ.3500 వరకు తీసుకుంటున్నారు. సాధారణంగా గంటలో ఎకరం కోత కావాల్సి ఉండగా బురద ఎక్కువగా ఉండడంతో రెండు గంటల వరకు సమయం పడుతోందని, దీంతో ఆర్థిక భారం అవుతోందని రైతులు చెబుతున్నారు. వాతావ రణంలో వస్తున్న మార్పులతోనే నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
జిల్లాలో దిగుబడి అంచనా 4.37 లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 4.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో మిల్లర్లు 77,885 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెలలో 25 వేల మెట్రిక్ టన్నులు, నవంబరులో 75 వేల మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 1.50 లక్షల మెట్రిక్ టన్నులు, వచ్చే జనవరిలో 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరా శాఖ ద్వారా 258 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పది కేంద్రాలను తగ్గించి 248 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 69 కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ ద్వారా 44 కేంద్రాలకు 29 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 194 కేంద్రాలకు 38, డీసీఎంఎస్ ద్వారా 6 కేంద్రాలకు 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమయ్యే గోనె సంచులు, టార్పాలిన్‌లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చరైజ్‌మీటర్లు, వెయింగ్ మిషన్‌లను సిద్ధం చేసినా ప్రారంభమైన కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టడం లేదు.