Share News

అరెస్టు అక్రమం

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:53 AM

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

అరెస్టు అక్రమం

సుప్రీంలో విచారణ పెండింగులో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధం

కోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించింది

ఆ సంస్థపై చర్యలు చేపట్టాలి

అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవన్నీ అబద్ధాలే

మద్యం కేసులో ఒక్క ఆధారమూ వారి వద్ద లేదు

నా విడుదలకు ఆదేశాలు ఇవ్వండి

సుప్రీంకోర్టులో 537 పేజీలతో కవిత రిట్‌ పిటిషన్‌

గత ఏడాది వేసిన పిటిషన్‌ ఉపసంహరణ

తల్లిని, కుమారులను కలుసుకునేందుకు

కవితకు ఢిల్లీ స్థానిక కోర్టు అనుమతి

మద్యం కేసు న్యాయమూర్తి నాగ్‌పాల్‌ బదిలీ

ఆయన స్థానంలో కావేరీ బవేజా నియామకం

న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సుప్రీంకోర్టులో తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు నిబంధలను ఉల్లంఘిస్తూ తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక, నిస్సహాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ మేరకు కవిత మంగళవారం సుప్రీంకోర్టులో 537 పేజీలతో కూడిన రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో వందలకోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ.. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని పిటిషన్‌లో కవిత గుర్తు చేశారు. తన అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలన్నీ పూర్తి అసత్యాలేనన్నారు. ట్రయల్‌ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ అప్లికేషన్‌ కూడా తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉంటుందని, కానీ తన విషయంలో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. మనీలాండరింగ్‌ చట్టం- 2002లోని సెక్షన్‌ 19(1) ప్రకారం ఈడీ అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసే ముందు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయాల్సి ఉందని, కానీ, దీనిని ఈడీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. వ్యక్తి స్వేచ్ఛను కట్టడి చేస్తూ మనీలాండరింగ్‌ చట్టం 2002కి మనీ/ఫైనాన్స్‌ బిల్లు ద్వారా సవరణ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు.

మనీలాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 19ని మహిళపై ప్రయోగించడాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించాలని కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15వ తేదీన ఈడీ తనను అరెస్టు చేసిన మరుసటి రోజే ప్రత్యేక కోర్టు తనను రిమాండ్‌కు పంపిందని, ఇదంతా పూర్తి యాంత్రికంగా జరిగిందని, ఇలా అనుచితంగా రిమాండ్‌కి పంపడం ఆర్టికల్‌ 21, 22(1)(2) కింద రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు దర్యాప్తు సంస్థల సమన్ల జారీపై గతంలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై విచారణ పెండింగులో ఉన్నందున.. విచారణ పూర్తయ్యేవరకూ సమన్లు ఇవ్వబోమని ఈడీ సుప్రీంకోర్టు ఎదుట హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని ఉల్లంఘించిందని కవిత పేర్కొన్నారు. ఈ కారణాల నేపథ్యంలో తన విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు. కాగా, సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె వేసిన పిటిషన్‌ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది. దీనితో కవిత తరఫున న్యాయవాదులు మంగళవారం మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారు.

రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణ

గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలవకుండా ఇంటివద్దనే విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని, కాబట్టి రిట్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి మంగళవారం ధర్మాసనానికి తెలియజేశారు. తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామన్నారు. దీంతో కవిత రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

తల్లి, కుమారులను కలుసుకునేందుకు అనుమతి

ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు. కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది. కవిత తల్లి శోభ బుధ, గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్టు సమాచారం. కాగా, రోజురోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతోంది. మంగళవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4.15 వరకు ప్రశ్నించినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపు టీ విరామం ఇచ్చి, మళ్లీ విచారణను ప్రారంభించినట్టు తెలిసింది. అందుకే, ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం ఇవ్వగా, మంగళవారం మాత్రం 7 తర్వాత అనుమతించారు.

మద్యం కేసు న్యాయమూర్తి బదిలీ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్‌ బదిలీ అయ్యారు. నాగ్‌పాల్‌ స్థానంలో కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్‌ సర్వీసె్‌సలోని 27 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో నాగ్‌పాల్‌ కూడా ఉన్నారు. ఆయన ఇకనుంచి కమర్షియల్‌ కోర్టు-13, సెంట్రల్‌, తీస్‌ హజారీ కోర్టుల్లో న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితతోపాటు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ తదితరుల అరెస్టు కేసులను నాగ్‌పాల్‌ విచారించారు. ప్రస్తుతం.. సిసోడియా, సంజయ్‌సింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా, కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు.

Updated Date - Mar 20 , 2024 | 04:53 AM