కార్యకర్తలే ఓడించారు!
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:14 AM
పార్టీ కార్యకర్తలే తమ ఓటమికి కారణమయ్యారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
అభ్యర్థిని మార్చమన్నా వినలేదంటూ
డోర్నకల్ నేతలు, కార్యకర్తల నిరసన
కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి
మానుకోట సన్నాహక భేటీలో కడియం
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కార్యకర్తలే తమ ఓటమికి కారణమయ్యారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ ముఖ్య నేతల ముందే తమ ఓటమికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులే కారణమని వారు విమర్శలకు దిగినట్లు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ.. కొందరు పార్టీ కార్యకర్తలే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పదేళ్లపాటు కార్యకర్తలను బాయిలర్ కోళ్లలాగా పెంచితే కాంగ్రె్‌సకు ఓటు వేశారంటూ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రె్‌సకే ఓటు చేశారని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు.. ఇప్పుడైనా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డోర్నకల్‌లో అభ్యర్థిని మార్చాలని కోరినా పార్టీ అధిష్ఠానం వినలేదని, అందుకే ఓడిపోయామని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న మాట వాస్తవమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ‘‘గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చేవారు. ఇక్కడ కేటీఆర్, హరీశ్‌ను కలిసే అవకాశం దొరక్కపోయినా.. ఊర్లోకి వెళ్లి ఆ ఇద్దరిని కలిశామంటూ గొప్పులు చెప్పుకొనే పరిస్థితి చాలామంది ఎదుర్కొన్నారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇది నిజం.. ఇప్పటికైనా మన వైఖరి మార్చుకుందాం... కార్యకర్తలను ఆదరించి.. వారికి దగ్గరవుదాం ’’అని పేర్కొన్నట్లు తెలిసింది.
శంకరమ్మతో కేటీఆర్, హరీశ్ లంచ్
అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కేటీఆర్, హరీశ్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన మనవడి పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించేందుకు వచ్చిన శంకరమ్మ గురువారం తెలంగాణ భవన్‌వద్ద కేటీఆర్, హరీశ్‌తో కలిసి భోజనం చేశారు. అయుతే, వారితో ఆమె ఏం చర్చించారన్న విషయం బయటకు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన శంకరమ్మకు ప్రభుత్వం కీలక పదవి ఇవ్వనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె కాంగ్రె్‌సవైపు వెళ్లకుండా సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర ఉద్యమకారులు సైతం కాంగ్రెస్ వైపు వెళ్తారన్న ఆందోళన బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నెలకొందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.