Share News

హద్దు మీరితే అంతే!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:03 AM

రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాసేలా వ్యవహరించినా వేటు వేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజా ప్రతినిఽధులు, రాజకీయ నాయకులతో సన్నిహిత ంగా మెలిగే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార శైలిపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారి రోజువారీ కార్యకలాపాలపైనే కాకుండా వారు ఉపయోగించే సామాజిక మాధ్యమాల ఖాతాలు, పోస్టులపైనా ఓ కన్నేసింది. ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా... ఏ అభ్యర్థికి సానుకూలంగా న డుచుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసింది.

హద్దు మీరితే అంతే!

ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ నజర్‌

రంగంలోకి ప్రత్యేక యంత్రాంగం

చిన్నపాటి ఆధారం లభించినా సస్పెన్షన్‌ వేటు

రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాసేలా వ్యవహరించినా వేటు వేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజా ప్రతినిఽధులు, రాజకీయ నాయకులతో సన్నిహిత ంగా మెలిగే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార శైలిపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారి రోజువారీ కార్యకలాపాలపైనే కాకుండా వారు ఉపయోగించే సామాజిక మాధ్యమాల ఖాతాలు, పోస్టులపైనా ఓ కన్నేసింది. ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా... ఏ అభ్యర్థికి సానుకూలంగా న డుచుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసింది.

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌, ఏప్రిల్‌ 18: లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా కొందరు తాము ప్రభుత్వ ఉద్యోగులమనే విషయాన్ని విస్మరించి రాజకీయ నాయకులతో ఇంకా అంటకాగుతూనేఉన్నారు. సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో తాము రాజకీయ ముఖ్య నాయకులకు చాలా సన్నిహితులమనే విషయం అందరూ గుర్తించే విధంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తుంటారు. రాజకీయ పార్టీల నాయకులతో సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం సేకరించిన ఎన్నికల సంఘం వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలిగే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగుల కదలికలను నిఘా నేత్రాలు వెంటాడే విధంగా చర్యలు చేపట్టింది. ఎన్నికలు లేని సమయంలో రాజకీయ నాయకులతో ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు.. అదే ఎన్నికల సమయంలో అందరి దృష్టి ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది. సాధారణంగా ఉద్యోగ సంఘాల నాయకులకు మండల స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, కొందరికి సీఎం స్థాయిలో పరిచయాలుంటాయి. అయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు, నాయకులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

హద్దుమీరితే అంతే సంగతులు

సాధారణంగా ఎన్నికల సమయంలో రిసార్ట్స్‌, గెస్ట్‌హౌస్‌లు, ఫంక్షన్‌ హాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక విందు సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఓట్లు కూడా తమకే అనుకూలంగా వేసేవిధంగావారిని ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు అభ్యర్థిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై హామీలు ఇవ్వడమే కాకుండా వారు తమ వైపు మొగ్గు చూపే విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా బహిరంగ రహస్యమే. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు, విందు, వినోద కార్యక్రమాలకు హాజరు కాకూడదు. రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండకూడదు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలి. వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలపై కూడా ఎన్నికల సంఘం నిఘా ఉంచింది. అయితే ఎన్నికల సంఘం ఎన్ని ఆంక్షలు విధించినా జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీల నాయకులతో రహస్య సమావేశాలు కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం.

ఏ చిన్న ఆధారం ఉన్నా.. సస్పెన్షన్‌ వేటే

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినట్లు ఏ చిన్న ఆధారం లభించినా ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేయనుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయ పార్టీలకు లేదా అభ్యర్థులకు సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆఽధారం లభించినా వేటు పడనుంది. రాజకీయ నాయకులతో సంప్రదింపులు చేసినా, సమావేశాల్లో పాల్గొన్నా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించినా.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్‌ల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు నమోదు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా ప్రచార సమావేశాలు, సభల్లో పాల్గొనడం, లేదా తమ వర్గానికి చెందిన నేత అంటూ రహస్యంగా ప్రచారం చేసినా కూడా తీవ్రంగానే పరిగణించనున్నారు. ఎన్నికల ప్రచారం చేయడం, ఫలానా పార్టీ, అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పడం కూడా తప్పిదంగానే భావిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా తమ పరిధి దాటి వ్యవహరించకూడదు. వారందరూ ఎన్నికల నియమావళికి లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్‌...

జిల్లాలో ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వరంగ, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, వారిలో 80 శాతం మంది వరకు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. క్లాస్‌ - 4 ఉద్యోగులను మినహాయించి మిగతా ఉద్యోగ, ఉపాధ్యాయులు అతి ముఖ్యమైన ఎన్నికల పోలింగ్‌ విఽధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత సాధారణ పరిపాలనా అంశాలు మినహా మిగతా అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అవుతాయి. పరిపాలనా పరమైన అంశాలు మినహా ఇతర నిర్ణయాలు ఏమైనా అమలు చేయాలంటే ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో తమ దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘన జరగకుండా.. ప్రవర్తనా నియమావళి అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది.

సస్పెన్షన్‌ వేటు పడితే...

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో సస్పెన్షన్‌ వేటుకు గురైతే తిరిగి ఉద్యోగంలో చేరడం చాలా కష్టం. సాధారణంగా సస్పెన్షన్‌కు గురయ్యే ఉద్యోగులను ఆరు నెలలలోపు ఉద్యోగంలో తిరిగి చేర్చుకుంటారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో తీవ్ర అభియోగాలతో ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెన్షన్‌ వేటుకు గురైతే మాత్రం.. ఉద్యోగంలో ఎప్పుడు చేరతారనేది ఎన్నికల సంఘం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల సంఘం అనుమతించిన తరువాతనే విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సస్పెన్షన్‌కు గురైతే తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి.

Updated Date - Apr 19 , 2024 | 12:03 AM