Share News

ఆ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌!

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:09 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఎదుట హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ వెల్లడించిన పేరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌దేనా!? కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో ఆయన పేరునే చెప్పారా!? ప్రభుత్వ అనుమతితో అరవింద్‌

ఆ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌!

శివబాలకృష్ణ ఏసీబీకి చెప్పింది ఆయన పేరే

విచారణకు అనుమతి కోరిన దర్యాప్తు సంస్థ

అనుమతి వస్తే నోటీసు జారీ చేసి విచారణ

బెయిల్‌ కోరుతూ కోర్టుకు వెళ్లిన శివబాలకృష్ణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఎదుట హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ వెల్లడించిన పేరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌దేనా!? కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో ఆయన పేరునే చెప్పారా!? ప్రభుత్వ అనుమతితో అరవింద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధమైందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నా యి అత్యంత విశ్వసనీయ వర్గాలు. మార్కెట్‌ విలువ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలకృష్ణ ఎనిమిది రోజుల ఏసీబీ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఓ ఐఏఎస్‌ అధికారి సూచన మేరకు నడుచుకున్నానని, ఆయనతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపానంటూ ఆ వివరాలను ఏసీబీ అధికారుల ఎదుట వివరించారు. నార్సింగిలోని కొంత వివాదాస్పద భూమికి సంబంధించి సదరు ఐఏఎస్‌ అధికారి ఆదేశాల మేరకే అనుమతులు ఇచ్చానని, ప్రతిఫలంగా స్థిరాస్తి వ్యాపారి నుంచి సదరు ఐఏఎస్‌ రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారని, అందులో మొదటి విడతగా గత డిసెంబరులో కోటి రూపాయలు చెల్లించానని ఏసీబీకి శివబాలకృష్ణ వివరించినట్లు తెలిసింది.

సదరు ఐఏఎస్‌తో జరిపిన మొత్తం లావాదేవీలు, నగదు చేరవేత తదితర వివరాలను ఏసీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ కాపీని ఏసీబీ అధికారులు కోర్టుకు, నిబంధనల మేరకు నిందితుడికి అందజేశారు. శివబాలకృష్ణతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించిన ఐఏఎస్‌ పేరు అధికారికంగా బయటకు రాలేదు. కానీ, ఏసీబీ ఎదుట శివబాలకృష్ణ చెప్పిన పేరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌దేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అరవింద్‌ కుమార్‌తో శివబాలకృష్ణకు సాన్నిహిత్యం ఉంద ని, ఆయన కార్యాలయంలోకి నేరుగా వెళ్లేవారని గుర్తుచేస్తున్నాయి. మరోవైపు, శివబాలకృష్ణ కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా సదరు ఐఏఎస్‌ను విచారించేందుకు ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరింది. అనుమతి ఇస్తే.. నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. వెరసి, వేగంగా మలుపులు తిరుగుతున్న ఈ కేసులో వచ్చే వారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సదరు ఐఏఎ్‌సతోపాటు మరికొందరికి ఏసీబీ నోటీసు లు జారీ చేసి ప్రశ్నించడంతోపాటు పక్కా ఆధారాలు ఉన్న వారిని అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఏసీబీ కస్టడీ ముగియడంతో బెయిల్‌ కోరుతూ శివబాలకృష్ణ కోర్టును ఆశ్రయించారు.

పత్రాల పరిశీలనకు రెవెన్యూ సహకారం

శివబాలకృష్ణ అరెస్ట్‌ సమయంలో, వరుస తనిఖీల్లో, బినామీల్ని విచారించిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల్ని ఏసీబీ పరిశీలిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూము లు, లే ఔట్లలో 29 ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో డబుల్‌, ట్రిబుల్‌ బెడ్‌రూం ప్లాట్లు 7, ఒక విల్లాను ప్రస్తుతానికి ఏసీబీ గుర్తించింది. ఇతర బినామీలను విచారించినప్పుడు కొత్త ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దాంతో, ఆయా ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు, సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల పరిశీలనకు రెవెన్యూ విభాగం సహకారం తీసుకుంటున్నారు.

నిఘాలో శివబాలకృష్ణ

సైదాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న శివబాలకృష్ణ భద్రత విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. సీసీ కెమెరాల నిఘాతోపాటు నిరంతరం అధికారుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. ఆయనను ఉంచిన బ్యారక్‌ వద్ద జైలు సిబ్బంది 24 గంటలూ పహరా కాస్తున్నారు. అనుమానితులను అక్కడికి రానివ్వడం లేదని తెలిసింది. ఇదే కేసులో జైలులో ఉన్న బాలకృష్ణ సోదరుడు నవీన్‌కుమార్‌ను కలవనీయకుండా వేరే బ్యారక్‌లో ఉంచినట్లు సమాచారం.

Updated Date - Feb 10 , 2024 | 04:09 AM