Share News

భయంకరి

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:31 AM

మంద నుంచి విడిపోయి.. దారి తప్పి.. వెర్రెత్తిన ఏనుగు కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మరో రైతును బలిగొంది. తెల్లవారుజామున పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న అన్నదాత ప్రాణాలు తీసింది. స్థానికులు, అధికారుల వివరాల ప్రకారం.. పెంచికలపేట మండలంలోని కొండపల్లి గ్రామానికి

భయంకరి

మరో రైతును తొక్కిచంపిన ఏనుగు

ఆసిఫాబాద్‌ జిల్లా కొండపల్లిలో ఘటన

మరో వ్యక్తిని 2 కిలోమీటర్లు వెంబడించిన వైనం

పలు మండలాల్లో 144 సెక్షన్‌

ఛత్తీస్‌గఢ్‌ ఏనుగు మహారాష్ట్ర నుంచి

తప్పిపోయి వచ్చింది.. దానికి హాని కలిగించొద్దు

వైల్డ్‌ లైఫ్‌ పీసీసీఎఫ్‌ పర్గేన్‌

పెంచికలపేట, బెజ్జూరు, మార్చి 4: మంద నుంచి విడిపోయి.. దారి తప్పి.. వెర్రెత్తిన ఏనుగు కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మరో రైతును బలిగొంది. తెల్లవారుజామున పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న అన్నదాత ప్రాణాలు తీసింది. స్థానికులు, అధికారుల వివరాల ప్రకారం.. పెంచికలపేట మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన రైతు కారు పోశన్న (65) గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తుండగా ఏనుగు ఒక్కసారిగా దాడిచేసింది. తొండంతో కొట్టి ఛాతీపై తొక్కడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇదే సమయంలో ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న ఎల్కరి సుధాకర్‌ కు ఏనుగు తారసపడింది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు అతడిని వెంబడించింది. సుధాకర్‌ చివరికి ఇంటికి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, పోశన్న మృతదేహాన్ని కొండపల్లి యువకులు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. కాగా, బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో వ్యవసాయ పనులు చేస్తున్న శంకర్‌ అనే రైతుపై దాడిచేసి చంపింన సంగతి తెలిసిందే. 24 గంటల్లో మరో ఘటన జరగడంతో జిల్లాలో కలకలం రేగుతోంది. ప్రజలు ఆందోళన చెందుతుండడంతో పెంచికలపేట, బెజ్జూరు, చింతలమానేపల్లి తదితర మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఏనుగు జాడ కోసం డ్రోన్లతో అధికారులు గాలిస్తున్నారు. పోశన్న కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, అతడి ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏనుగు దాడిలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్‌గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.

రాత్రివేళ బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు

ఏనుగు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కాగజ్‌నగర్‌ నుంచి బెజ్జూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వచ్చింది. లోడ్పల్లి- సులుగుపల్లి మధ్యలో జరిగిన ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొంత సమయం రోడ్డుపైనున్న ఏనుగు అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న సీఎఫ్‌ శాంతారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్రజల రక్షణకు పటిష్ఠ చర్యలు

- పీసీసీఎఫ్‌ పర్గేయన్‌

ఏనుగుల గుంపు ఛత్తీ్‌సగఢ్‌ నుంచి మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు సాగిస్తుందని.. రెండు నెలల క్రితం 60-70, రెండు రోజుల కిందట 20-30 ఏనుగులు మహారాష్ట్రకు వచ్చాయని వైల్డ్‌ లైఫ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) మోహన్‌చంద్ర పర్గేయన్‌ తెలిపారు. ఈ గుంపు నుంచే ఒక ఏనుగు ఆసిఫాబాద్‌ జిల్లాకు చేరిందని చెప్పారు. ప్రజల రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని, మరో దాడి జరగకుండా చూస్తామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏనుగుకు ప్రజలు ఎలాంటి హాని తలపెట్టవద్దని, అలాగైతేనే అది ఇక్కడినుంచి వెళ్లిపోతుందన్నారు. ఏనుగులను నియంత్రించే విధానం తెలుసుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ అటవీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.

Updated Date - Apr 05 , 2024 | 05:31 AM