Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

నిబంధనలు బేఖాతర్‌!

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:20 AM

ఎవరేలినా ఏముంది గర్వకారణం.. అన్నట్లుగా అటు ప్రత్యేకాధికారులైనా, ప్రజాప్రతినిధులైనా వెలగబెట్టిందేమీ లేదనట్లుగా మారింది ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిస్థితి. ఈ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్‌ యార్డు రావణకాష్ఠంలా మండుతూనే ఉంది. చెత్తను కాల్చివేయడంతో వచ్చే విషవాయువులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు కలుషితమైనా, ప్రజల ఆరోగ్యాలు మంటకలిస్తే మాకేంటీ అన్నట్లుగా అధికారుల, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. లక్షలాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన పొడి చెత్త నిర్వహణ కేంద్రం, తడి చెత్తను ఎరువుగా మార్చే షెడ్లు వెక్కిరిస్తున్నాయి.

 నిబంధనలు బేఖాతర్‌!

ఘట్‌కేసర్‌లో రావణ కాష్టంలా మండుతున్న డంపింగ్‌ యార్డు

విషవాయువులు పొగతో జనం బెంబేలు

రోగాల బారిన ప్రజలు.. పరిసరాలు పూర్తిగా కలుషితం..

నిరుపయోగంగా తడి చెత్తను ఎరువుగా మార్చే కేంద్రం

పట్టించుకోని అధికారులు

ఎవరేలినా ఏముంది గర్వకారణం.. అన్నట్లుగా అటు ప్రత్యేకాధికారులైనా, ప్రజాప్రతినిధులైనా వెలగబెట్టిందేమీ లేదనట్లుగా మారింది ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిస్థితి. ఈ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్‌ యార్డు రావణకాష్ఠంలా మండుతూనే ఉంది. చెత్తను కాల్చివేయడంతో వచ్చే విషవాయువులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు కలుషితమైనా, ప్రజల ఆరోగ్యాలు మంటకలిస్తే మాకేంటీ అన్నట్లుగా అధికారుల, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. లక్షలాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన పొడి చెత్త నిర్వహణ కేంద్రం, తడి చెత్తను ఎరువుగా మార్చే షెడ్లు వెక్కిరిస్తున్నాయి.

ఘట్‌కేసర్‌, మార్చి3 : జాతీయ గ్రీన్‌ ట్రెబ్యునల్‌ నిబంధనలుగానీ, కాలుష్యనియంత్రణ మండలి ఆదేశాలు మాకు వర్తించవు అన్నట్లుగా ఉన్నది ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ అధికారుల తీరు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 2018 అక్టోబరు 17న ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఘట్‌కేసర్‌, ఎన్‌ఎ్‌ఫసీనగర్‌, కొండాపూర్‌లను కలిపి ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాదిన్నపాటు ప్రత్యేకాధికారుల పాలనలో నడిచింది. 2020 జనవరి 27న మున్సిపాలిటీపాలకవర్గం కొలువుదీరింది. ఎవరేలినా ఏముంది గర్వకారణం అన్నట్లుగా అటు ప్రత్యేకాధికారులైన, ప్రజాప్రతినిధులైన వెలగబెట్టిందేమీ లేదనట్లుగా మారింది మున్సిపాలిటీ పరిస్థితి. దాదాపు ఐదేళ్లుగా రావణకాష్టంలా డంపింగ్‌యార్డులో చెత్త కాల్చుతూనే ఉన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కొండాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 157లో గల ప్రభుత్వ స్థలంలో దాదాపు 8 ఎకరాలు విస్తీర్ణంలో గతంలో మట్టిని తవ్వుకుపోయారు. మట్టిని తరలించిండంతో ఏర్పడిన భారీ గోతుల్లో చెత్తను వేస్తూ నిబంధనలకు విరుద్ధంగా తగలబెడుతున్నారు. మంటలు ఎక్కువైనప్పుడు డంపింగ్‌ యార్డు తగులబడుతున్నదని అగ్నిమాపకశాఖకు ఫోన్‌ చేయడం..ఫైౖరింజన్‌ వచ్చి మంటలను అదుపు చేయడం.. ప్రజాపతినిధులు మంటలను దగ్గరుండి ఆర్పించామని చెప్పుకోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.

ఐదేళ్లుగా మండుతూనే...

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్‌ రెవెన్యూలోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు రావణ కాష్టంలా మండుతూనే ఉన్నది. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలోని 18వార్డులకు సంబంధించిన చెత్తను నిత్యం ట్రాక్టర్లు, ఆటోల ద్వారా తీసుకువచ్చి ఇక్కడ పారబోస్తున్నారు. అందులోంచి అవసరమైన వస్తువులను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఏరుకొని తీసు కుపోగా మిగిలిన చెత్తను కాల్చి వేస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రెబ్యునల్‌ నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. చెత్తను కాల్చడంతో వెలువడే పొగ అత్యంత ప్రమాదకరం కనుక సేకరించిన చెత్తను తడి, పొడిగా వేరు చేయాలి. ఈ ప్రక్రియను చేపట్టడానికి సిబ్బంది కావాలి..అది పెద్ద పనిభారం కావడంతో చేసేదేమీ లేక చెత్తను కాల్చివేస్తున్నారు. దీంతో పరిసరాలు కలుషితమై ప్రజల అనాఆరోగ్యాల బారిన పడుతున్నారు.

చెత్త వేరు చేయడం ఎక్కడ?

తడి,పొడి, హానికారమైన చెత్తను వేరు చేయాలి. కానీ ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని డంపింగ్‌ యార్డులో మాత్రం అలాంటేమి కనిపించడం లేదు. నిత్యం ఇళ్లలో నుంచి సేకరించిన చెత్తను తడి, పొడిగా వేరు చేయాలి. తడి చెత్తను ఎరువు తయారు చేసి విక్రయించాలి. పొడి చెత్తను తిరిగి వినియోగించే పరిశ్రమలకు విక్రయించడం చేయాలి. హానికరమైన చెత్తను సైతం ఆయా పరిశ్రమల నిర్వాహకులకు అప్పగించాలి. ఇది చెప్పడానికి అంతా బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అమలుకావడం లేదు. ఇప్పటికే మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం దగ్గర పడుతున్నది. అయినా మున్సిపాలిటీలో చెత్త డంపింగ్‌ యార్డు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని చెత్తడంపింగ్‌ యార్డు పరిసరాలు కంపు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కవర్లే దర్శనమిస్తున్నాయు. చిన్నపాటి గాలి వీస్తే పాస్టిక్‌ కవర్లు గాలిపటాల్లా ఎగిరి పంటపొలాల్లో పడుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు.

ఎక్కడ చూసినా చెత్తే ..

కొండాపూర్‌లోని డంపింగ్‌ యార్డు పరిసరాలు పూర్తిగా కలుషితమయ్యాయి. సమీపంలోని పంట పొలాలు ప్లాస్టిక్‌ కవర్లతో నిండిపోతున్నాయి. చెత్త ఆటోల నిర్వాహకులు ఎక్కడ బడితే అక్కడ చెత్తను పారబోస్తున్నారు. ఏళ్ల తరబడి డంపింగ్‌ యార్డులో నుంచి దట్టమైన పొగలు వస్తూనే ఉన్నాయి. ఈ పొగను పీల్చీ ప్రజలు అనారోగ్యాలకు గురౌతున్నాము. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.

డక్కి రమేష్‌, మాజీ సర్పంచ్‌, కొండాపూర్‌

చెత్తను కాల్చడం దారుణం

చెత్తను కాల్చడం నిలిపివేయాలి. నేషనల్‌ గ్రీన్‌ ట్రెబ్యునల్‌ నిబంధనల ప్రకారం చెత్తను కాల్చడం చట్టవిరుద్ధ్దం. ప్రధానంగా డంపింగ్‌ యార్డుల్లో ని చెత్త ప్రమాదకరమైది. కాల్చిన చెత్త నుంచి వెలువడే వాయువులు అత్యంత ప్రమాదకరమైనవి. దానిని పీల్చడంతో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చెత్తను కాల్చకుండా చర్యలు తీసుకోవాలి

- కందకట్ల రామకృష్ణారెడ్డి, న్యాయవాది, ఘట్‌కేసర్‌

తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నాం

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో చెత్తను కాల్చకుండా చర్యలు తీసుకుంటున్నాం. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాం. మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను వేరు చేసే పనిని ఓ స్వచ్చంద సంస్థకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేరు చేసి అప్పగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

- ఎండీ సాబేర్‌ అలీ కమిషనర్‌ ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ

Updated Date - Mar 04 , 2024 | 12:21 AM