Share News

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:33 PM

తమ కుమారుడు పదో తరగతి పరీక్షలు ఉత్సాహంగా రాస్తున్నాడు.. పరీక్షలు ముగిస్తే సెలవులు, ఆ తర్వాత ఇంటర్‌లో చేర్పించాలన్న తల్లిదండ్రుల కలలపై పాము విషం చిమ్మింది. పాముకాటుతో విద్యార్థి బంగారు భవిష్యత్‌ కరిగిపోయి, తల్లిదండ్రుల కల చెదిరిపోయి పుట్టెడు శోకంలో మునిగారు.

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి
ఉమేష్‌(ఫైల్‌)

మోత్కూరు, మార్చి 27: తమ కుమారుడు పదో తరగతి పరీక్షలు ఉత్సాహంగా రాస్తున్నాడు.. పరీక్షలు ముగిస్తే సెలవులు, ఆ తర్వాత ఇంటర్‌లో చేర్పించాలన్న తల్లిదండ్రుల కలలపై పాము విషం చిమ్మింది. పాముకాటుతో విద్యార్థి బంగారు భవిష్యత్‌ కరిగిపోయి, తల్లిదండ్రుల కల చెదిరిపోయి పుట్టెడు శోకంలో మునిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబం ధించిన వివరాలిలా ఉన్నాయి. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల కుమార్‌, మమత దంపతుల కుమారుడు ఉమేష్‌(16) గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18 నుంచి మోత్కూరులోని పరీక్ష కేంద్రానికి వెళ్లి వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. ఇప్పటికే నాలుగు పరీక్షలు పూర్త య్యాయి. మంగళవారం పరీక్ష రాసి వచ్చిన ఉమేష్‌ రాత్రి పొద్దుపోయే వరకూ గురువారం నాటి పరీక్షకోసం చదువుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు, తోబుట్టువుల పక్కన నేల మీద పడుకున్నాడు. రాత్రి నిద్రలో కట్ల పాము ఎప్పుడు కాటేసిందో ఎవరూ గమనించలేదు. అర్ధరాత్రి దాటాక ఉమేష్‌ లేచి కూర్చుని తల్లిదండ్రులను లేపి తనకు నలతగా ఉందని చెప్పాడు. ఇంతలో వాంతులు చేసుకున్నాడు. తనను ఏదో కరిచినట్టు అనిపించిందని చెప్పాడు. దీంతో వారు ఇంట్లో వెతకగా కట్ల పాము కనిపించింది. వెంటనే దాన్ని కొట్టి చంపారు. ఉమే్‌షను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరో సారి వాంతి చేసుకుని మృతి చెందాడు. మమత, కుమార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా ఉమేష్‌ పెద్దవాడు. ఈ సంఘటనతో దత్తప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర విద్యార్థులు బుధవారం సాయం త్రం నిర్వహించిన ఉమేష్‌ అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 11:33 PM