Share News

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆగస్టులో టెండర్లు!

ABN , Publish Date - May 22 , 2024 | 05:12 AM

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆగస్టులో టెండర్లు!

కసరత్తు చేస్తున్న అధికారులు

6 ప్యాకేజీలుగా 161 కి.మీ పనులు

2 చోట్ల మినహా భూసేకరణ పూర్తి

పరిహారం చెల్లింపు దిశలో చర్యలు

హడ్కో రుణానికి ప్రభుత్వ ప్రయత్నం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర భాగానికి సంబంధించి ఒకట్రెండు చోట్ల మినహా.. భూసేకరణలో కీలక దశలు పూర్తయిన నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించి, పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు రెండో వారంలో టెండర్లను ఆహ్వానించి.. ఓవైపు పనులను చేపడుతూనే, మరోవైపు పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై దృష్టి సారించాలని నిర్ణయించింది.ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం ఉత్తర-దక్షిణ భాగాలుగా మొత్తం 350 కిలోమీటర్ల మేర జరగనుంది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, ప్రజ్ఞాపూర్‌, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకు 161 కిలోమీటర్లు ఉత్తర భాగం పరిధిలో ఉన్నాయి. చౌటుప్పల్‌ నుంచి ఆమనగల్లు, షాద్‌నగర్‌, చేవెళ్ల మీదుగా తిరిగి సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్లు దక్షిణ భాగంలో ఉన్నాయి.

తొలుత ఉత్తర భాగంలో భూసేకరణ దాదాపుగా పూర్తయింది. ఒక్క నర్సాపూర్‌, భువనగిరిలో మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది. గజ్వేల్‌ సమీపంలోని నర్సాపూర్‌లో అటవీ భూములు ఉన్నాయి. దీంతోపాటు.. అక్కడ కొందరు భూయజమానులు తమ భూములను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ కారణంగా ఓ దశలో అలైన్‌మెంట్‌ మార్చాలని అధికారులు భావించారు. అయితే.. ముందుగా ఎంచుకున్న అలైన్‌మెంట్‌ శాస్త్రీయంగా ఉండడంతో.. అటవీ, ఇతర భూముల సమస్యను అధిగమించే దిశలో చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో మాత్రం రైతుల నుంచి ఆందోళనలు ఎదురయ్యాయి. తొలుత సరిహద్దు రాళ్లను పాతిన ప్రాంతాల నుంచి కాకుండా.. తమ పొలాల్లోంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్లేలా అలైన్‌మెంట్‌ మార్చారంటూ వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అక్కడ భూసేకరణ పెండింగ్‌లో ఉంది. నిజానికి 90ు భూసేకరణ పూర్తయితే తప్ప.. ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణ పనులకు ముందుకు రాదు. అయితే.. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో మాత్రం.. ఇప్పటి వరకు సేకరించిన భూమిలో పనులను ప్రారంభిస్తే.. వివాదాలను సమాంతరంగా పరిష్కరించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఆరు ప్యాకేజీల్లో పనులు

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం 161 కిలోమీటర్లను అధికారులు ఆరు ప్యాకేజీలుగా విభజించారు. వీటిల్లో మొదటి ప్యాకేజీలో 34.5 కి.మీ, రెండో ప్యాకేజీలో 26 కి.మీ, మూడో ప్యాకేజీలో 23 కి.మీ, నాలుగో ప్యాకేజీలో 29 కి.మీ, ఐదో ప్యాకేజీలో 31.1 కి.మీ, ఆరో ప్యాకేజీలో 17.9 కి.మీ ఉన్నాయి. ఈ ప్యాకేజీ పనులకు ఆగస్టు రెండో వారంలో టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసేకరణ పూర్తయిన చోట్ల ఇప్పటికే అలైన్‌మెంట్‌ సిద్ధమవ్వగా.. రైతులు, భూయజమానులకు నష్టపరిహారం చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు ఖరారు చేసి, అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే సర్వే, భూసేకరణ వంటి పనులు పూర్తయినా.. నష్టపరిహారం పెండింగ్‌లో ఉండడంతో పనుల్లో ఆలస్యం నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటవ్వగానే.. సీఎం రేవంత్‌రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ అంశంపై దృష్టిసారించారు. మూడేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పలు సందర్భాల్లో ప్రకటించారు. యుటిలిటీ చార్జీల విషయంలో ఏర్పడ్డ ఆటంకాలను కూడా తొలగించేలా కేంద్రంతో చర్చలు జరిపారు. ఆ సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, నష్టపరిహారంపై దృష్టిసారించారు.

పరిహారం చెల్లింపులకు హడ్కో రుణం

ఉత్తర భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తవ్వడానికి 1,940 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.14 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇందులో భూపరిహారానికే రూ.5,200 కోట్లు మేర అవసరం ఉంటుంది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌హెచ్‌ఏఐ సేకరించే భూములకు సంబంధించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం 50ు మేర భరించాల్సి ఉంటుంది. ఆ హామీతోనే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి ముందడుగు పడేలా గత సర్కారు చర్యలు తీసుకుంది. 2018 ఆగస్టు 29న అప్పటి సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిన లేఖలో ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్ల మేర పరిహారభారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు.. ఆ వాటాను బ్యాంకుల ద్వారా ఒకేసారి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. తొలుత నాబార్డు రుణంపై దృష్టిసారించినా.. వడ్డీ ఎక్కువ కావడం వల్ల హడ్కో వైపు దృష్టి సారించారు. హడ్కోకు సమర్పించేందుకు డీపీఆర్‌, ఇతర వివరాలను సిద్ధం చేసినట్లు సమాచారం. హడ్కో రుణం విడుదలవ్వగానే.. చకచకా నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు వడివడిగా సాగేలా చర్యలు తీసుకుంటోంది.

Updated Date - May 22 , 2024 | 05:13 AM