Share News

మాడు మండుతోంది!

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:52 AM

భానుడి భగభగలతో మాడు మండుతోంది. ఉదయం ఎనిమిది నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బయటకు వెళితే వేడిగాలులు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇంటి

మాడు మండుతోంది!

నిడమనూరు, నేలకొండపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు

భూపాలపల్లి జిల్లాలో వడదెబ్బకు ఒకరి మృతి

నల్లగొండ, ఏప్రిల్‌ 25: భానుడి భగభగలతో మాడు మండుతోంది. ఉదయం ఎనిమిది నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బయటకు వెళితే వేడిగాలులు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. గురువారం నల్లగొండ జిల్లా నిడమనూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలు, ముదిగొండ మండలం పమ్మిలలో 44.9, బాణాపురంలో 44.8, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 44.7, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలలో 43.7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు మించే నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళల్లోనూ ఏమాత్రం ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కామేపల్లి, ఎన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్లు, చింతకాని మండలాల్లో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కొత్తగూడెం జిల్లాలో గుండాల, ఇల్లెందు, దమ్మపేట, అశ్వారావుపేట, టేకులపల్లి మండలాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా.. మిగిలిన మండలాలన్నీ రెడ్‌ అలర్ట్‌లోనే ఉన్నాయి. కాగా, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం వృద్ధాప్య పింఛను తీసుకుని ఇంటి వెళ్తుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురై గైకోటి రాధాబాయి (75) మృతి చెందింది.

Updated Date - Apr 26 , 2024 | 04:52 AM