Share News

‘కాళేశ్వరం’పై మీ వైఖరి చెప్పండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:43 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్‌లకు సంబంధించి మరోసారి ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు

‘కాళేశ్వరం’పై మీ వైఖరి చెప్పండి

సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్లపై.. రాష్ట్ర సర్కారుకు మరోసారి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్‌లకు సంబంధించి మరోసారి ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌, ప్రొఫెసర్‌ కోదండరాం, న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి, ఎం. విశ్వనాథ్‌రెడ్డి, బక్క జడ్సన్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటికే న్యాయవిచారణకు జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశామని.. దాంతోపాటు విజిలెన్స్‌ ఎంక్వైరీ, నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలనలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలియజేసిందని ధర్మాసనం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇంకా సీబీఐ దర్యాప్తు కావాలని కోరుతున్నారా? అని పిటిషనర్‌లను ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తాము ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నామని, సీబీఐ దర్యాప్తు అంశంపై వైఖరి తెలియజేయడానికి మరోసారి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. కేఏ పాల్‌ వ్యక్తిగతంగా వాదనలు వినిపిస్తూ.. ఇతరుల పిటిషన్‌లలో లేని అంశాలు తనవద్ద ఉన్నాయని.. తాను రెండేళ్లు దీనిపై పరిశోధన చేశానని పేర్కొన్నారు. మేఘా కృష్ణారెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారని.. అందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం లేదని ఆరోపించారు. తాను స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రిని, సీబీఐ డైరెక్టర్‌ను కలిశానని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ అంశాలన్నీ మీ పిటిషన్‌లో ఎక్కడ పేర్కొన్నారు? మీకు సమాచారం ఎక్కడ నుంచి లభించింది? అవినీతి జరిగిందని మీకు ఎలా తెలిసింది? ఎన్నికల ప్రసంగాలు చేయడానికి ఇది వేదిక కాదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం కోసం మాపై ఒత్తిడి తేవొద్దు. ఇవన్నీ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ పిటిషన్‌లా ? లేక పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ పిటిషన్‌లా? లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎవరూ కనిపించరు’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తమ వ్యాజ్యాలను వేర్వేరుగా వినాలని.. తమకు అవకాశం ఇవ్వాలని ఇతర పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులు కోరగా.. ఒకే అంశంపై వేర్వేరుగా వాదనలు వినడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. కావాలంటే తమ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది.

Updated Date - Apr 03 , 2024 | 08:27 AM