Share News

భాష మార్చుకోమని కేసీఆర్‌కు చెప్పండి

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:53 AM

‘కల్వకుంట్ల (జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌)అయినా మంచోడే. మొన్న నల్లగొండ సభలో దున్నపోతు, బర్రెలు అంటూ కేసీఆర్‌ ఏమెమో మాట్లాడిండు. ఆ మాటలు వినలేక కాసేపు టీవీ బంద్‌ చేసిన.

భాష మార్చుకోమని కేసీఆర్‌కు చెప్పండి

కల్వకుంట్ల.. అయినా సంజయ్‌ మంచోడే

జీరో అవర్‌లో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు

సమస్యలను ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు

మంత్రుల దృష్టికి తీసుకెళ్తానన్న కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘కల్వకుంట్ల (జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌)అయినా మంచోడే. మొన్న నల్లగొండ సభలో దున్నపోతు, బర్రెలు అంటూ కేసీఆర్‌ ఏమెమో మాట్లాడిండు. ఆ మాటలు వినలేక కాసేపు టీవీ బంద్‌ చేసిన. ఆ భాష మార్చుకోవాలని కేసీఆర్‌కు మీరైనా మెయిల్‌ చేయండి’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. శాసనసభలో శుక్రవారం జీరో అవర్‌ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలతోపాటు ఇతర అంశాలను ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ మాట్లాడుతూ తాను కొత్తగా సభలోకి వచ్చానని, తన లాంటి వారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని, కొందరు సభ్యుల భాషలో మార్పు రావాలని ఆకాంక్షించారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు. నల్లగొండ అంటేనే మర్యాదకు మారు పేరని వ్యాఖ్యానించారు. అలాగే, మరి కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ‘‘ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రగతి నివేదికల పేరుతో రూ.లక్ష కోట్ల పనులకు కేటీఆర్‌ ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. ఇప్పుడు ఆ పనులన్నీ నన్ను చేయమని కోరుతున్నారు. నేనేం చేయాలె’’ అని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సాయం కావాలని కోరుతూ వచ్చిన 60వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో హాస్టల్‌ కాంప్లెక్స్‌లు కట్టనున్నామని చెప్పారు. ఆర్టీసీ కోసం మరో 1000బస్సులు కొంటామని ప్రకటించారు. కాగా, తమకు తగిన గౌరవం ఇవ్వాలని, అసెంబ్లీతోపాటు నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. పదేళ్లుగా ఆలేరులో ఒక్క కుటుంబం, ఒక్క కులానికే మేలు జరిగిందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. షాద్‌నగర్‌ ప్రాంతానికి సాగు నీరు అందించే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే శంకరయ్య కోరారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌తోపాటు మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని ఎల్కుర్తిలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉందని, దాన్ని సికింద్రాబాద్‌కు తరలించే యోచన విరమించుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. కాగా, సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నింటినీ నోట్‌ చేసుకున్నామని, వాటిని ఆయా మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Feb 17 , 2024 | 03:53 AM