Share News

తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఎండీపై వేటు!

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:51 AM

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.కేశవులుపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఎండీపై వేటు!

కేశవులును తప్పించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు

ఐఏఎస్‌ అధికారి హరితకు ఎండీగా బాధ్యతలు

పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక

అందజేయాలని కార్యదర్శికి ఆదేశం

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.కేశవులుపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. కేశవులును తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కేశవులు స్థానంలో రాష్ట్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరితకు బాధ్యతలను అప్పగించారు. ఐఏఎస్‌ అధికారి అయిన హరిత రాష్ట్ర సహకారశాఖ రిజిస్ట్రార్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా సీడ్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. సీడ్స్‌ కార్పొరేషన్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీలో జరిగిన అవకతవకలపై నెలరోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావును మంత్రి తుమ్మల ఆదేశించారు. ‘సీడ్‌ కార్పొరేషన్‌లో సిత్రాలెన్నో!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం కథనం ప్రచురితమైన విషయం విదితమే! జయశంకర్‌ యూనివర్సిటీలో విత్తన పరిశోధన విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కె.కేశవులు సుదీర్ఘ కాలంగా జోడు పదవుల్లో(కార్పొరేషన్‌ ఎండీ, సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌) కొనసాగుతున్నారు. ఈ రెండు సంస్థల్లో పలు అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘ఇస్టా’ కాంగ్రెస్‌ పదవిని అడ్డంపెట్టుకొని ఏకంగా 28 విదేశీ పర్యటనలు చేశారు. ఈ అంశాలపై పరిశోఽధనాత్మక కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, చర్యలకు ఉపక్రమించింది. మంత్రి తుమ్మల గురువారం ఉదయమే చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

గత పదేళ్ల చిట్టా తీయండి..

వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్‌, సహకార అనుబంధ శాఖల పరిధిలోని పలు కార్పొరేషన్ల పనితీరుపై మంత్రి తుమ్మల గురువారం నాటి సమీక్ష సందర్భంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. గడిచిన పదేళ్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అవసరమైతే ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి సంస్థకు, రైతులకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారులు హరిత, డాక్టర్‌ గోపిలకు అప్పగించారు. పదిరోజుల్లో నివేదికను అందజేయాలని ఆదేశించారు. డాక్టర్‌ గోపికి 5 కార్పొరేషన్ల విచారణ బాధ్యతలను అప్పగించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి, విత్తన-సేంద్రియ ధ్రువీకరణ సంస్థ, టీఎ్‌స-ఆగ్రోస్‌, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ అసోసియేషన్‌(హాకా) ఉన్నాయి. టీఎ్‌స-మార్క్‌ఫెడ్‌, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, స్టేట్‌ కో-ఆపరేటివ్‌ రూరల్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌, టీఎస్‌ కో-ఆపరేషన్‌ యూనియన్‌, టీఎస్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ ఫెడరేషన్లలో పదేళ్ల కార్యకలాపాలపై విచారణ బాధ్యతలను హరితకు అప్పగించారు. మరోవైపు ఉద్యాన అభివృద్ధి సంస్థపై విచారణ బాధ్యతలను ఆ శాఖ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి నిర్వర్తిస్తారు.

ఇస్టా బాధ్యతలతోనే విదేశీ పర్యటనలు: డాక్టర్‌ కె. కేశవులు

కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన రూ.40 లక్షల నిధులతో స్టేట్‌ కో-ఆపరేటివ్‌ రూరల్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌(టీఎ్‌స-సీఆర్‌ఐసీ)ద్వారా రాజేంద్రనగర్‌లోని వ్యవ సాయ వర్సిటీ ప్రాంగణంలో జీవోటీ ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కేశవులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్టా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికవటంతో.. ఈ పదవిలో ఉన్నంతవరకు విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ సర్కారుకు సిఫారసు చేసిందని, అందుకు అనుగుణంగానే విధులు నిర్వర్తిస్తున్నట్లు వివరించారు. ఇస్టా కాంగ్రెస్‌ వైస్‌ చైర్మన్‌, అధ్యక్ష హోదాలోనే విదేశీ పర్యటనలు చేశానని, మెజారిటీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులన్నీ ఇస్టానే భరించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా విదేశాల్లో జరిగే సమావేశాల్లో ఇస్టా ప్రెసిడెంట్‌ హోదాలో పాల్గొనాల్సి ఉంటుందని వెల్లడించారు. సీడ్‌ సర్టిఫికేషన్‌ రిజిస్ట్రేషన్లను ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌కు మార్చటంతోనే.. రిజిస్ట్రేషన్లలో హెచ్చుతగ్గులు కనిపించాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇస్టా కాంగ్రెస్‌ నిర్వహణలో నిధుల గోల్‌మాల్‌ జరగలేదని తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 03:52 AM