తెలంగాణ ఊటీ.. పర్యాటక బ్యూటీ!
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:51 PM
లోతైన లోయలు.. వంపులు తిరిగిన రోడ్ల మలుపులు.. పచ్చని ప్రకృతి సౌందర్యం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవు అనంతగిరులు.. ఈ ప్రాంతం చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. పక్షుల కిలకిలారావాలకు నెలవైన అనంత కొండలకు ఇక మహర్దశ పట్టనుంది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి ఇక పర్యాటక బ్యూటీగా మారబోతోంది. కేంద్ర పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అనంతగిరి కొండల్లో 213 ఎకరాలను ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం) జోన్‌గా తీర్చిదిద్దనున్నారు. అంతే కాకుండా సమీపంలోనే ఉన్న కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులను అభివృద్ధి పరచనున్నారు.

స్వదేశీ దర్శన్ 2.0లో అనంతగిరి
కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులకూ పర్యాటక శోభ
రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు
మొదటి ప్యాకేజీలో రూ.38 కోట్ల కేటాయింపు
నేడు వర్చువల్‌గా పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వీక్షించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాట్లు
ప్రాజెక్టు గురించి వివరించనున్న పీడీఎంసీ అధికారులు
లోతైన లోయలు.. వంపులు తిరిగిన రోడ్ల మలుపులు.. పచ్చని ప్రకృతి సౌందర్యం.. ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవు అనంతగిరులు.. ఈ ప్రాంతం చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. పక్షుల కిలకిలారావాలకు నెలవైన అనంత కొండలకు ఇక మహర్దశ పట్టనుంది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి ఇక పర్యాటక బ్యూటీగా మారబోతోంది. కేంద్ర పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అనంతగిరి కొండల్లో 213 ఎకరాలను ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం) జోన్‌గా తీర్చిదిద్దనున్నారు. అంతే కాకుండా సమీపంలోనే ఉన్న కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులను అభివృద్ధి పరచనున్నారు.
వికారాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి) : తెలంగాణ ఊటీగా ఖ్యాతి పొందిన అనంతగిరి కొండలను ఎకో టూరిజం జోన్‌గా అభివృద్ది పరిచే పనులు ఇక కార్యరూపం దాల్చబోతున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద అనంతగిరి కొండలను పర్యాటక పరంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. అనంతగిరి కొండలను ఎకో టూరిజంగా అభివృద్ధి పరిచే ప్రతిపాదనపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అనంతగిరి కొండల్లో 213 ఎకరాలను ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం) జోన్‌గా తీర్చిదిద్దనున్నారు. అంతే కాకుండా సమీపంలోనే ఉన్న కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులను పర్యావరణ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద అనంతగిరి కొండలను రూ.98 కోట్లతో ఎకో టూరిజం జోన్‌గా అభివృద్ది పరచనున్నారు. మొదటి ప్యాకేజీలో రూ.38 కోట్లతో ఎకో టూరిజం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కాగా, ఈ రెండు ప్రాజెక్టుల వద్ద పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం పర్యాటక శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అనంతపద్మనాభస్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాల పరిసరాలనూ అభివృద్ధి పరిచే పనులు కూడా స్వదేశీ దర్శన్ కింద చేపట్టనున్నట్లు తెలిసింది.
ఎల్‌అండ్‌టీ సంస్థకు అభివృద్ధి బాధ్యతలు
అనంతగిరిని ఎకో టూరిజంగా అభివృద్ధి పరిచే పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ పర్యవేక్షిస్తోంది. ప్రణాళిక రూపకల్పన, అభివృద్ది పరిచే బాధ్యతలను ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్‌గా ఈ పనులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా అనంతగిరి కొండలను ఎకో టూరిజంగా ఏ విధంగా అభివృద్ధి పరచనున్నారనేది స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రాజెక్టు డెవల్‌పమెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (పీడీఎంసీ), పర్యాటక శాఖ అధికారులు వివరించనున్నారు.
వేల సంఖ్యలో సందర్శకులు...
అనంతగిరి కొండలు రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉండడంతో ఇక్కడే వచ్చే పర్యాటకుల సంఖ్యవేలల్లో ఉంటోంది. వారాంతాల్లో 5 వేల నుంచి 10 వేల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. వర్షాకాలంలో ఈ తాడికి మరింత అధికంగా ఉంటుంది. పర్యాటకుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. కాటేజీలు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, రోడ్లు, పార్కింగ్, ట్రాకింగ్ పాయింట్, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. అంతే కాకుండా ట్రెక్కింగ్, రోప్‌వేస్,. వ్యూ పాయింట్, పార్కులు ఏర్పాటు చేస్తారు. రాత్రివేళలో వెయ్యి మంది పర్యాటకులు అనంతగిరిలో బస చేసే విధంగా సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోన్నారు. కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులనూ పర్యావరణ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరచనుండడంతో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా, అనంతపద్మనాభస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.200 కోట్లతో ప్రణాళికలు రూపొందించినా అవి ప్రతిపాదనలకే పరిమితమైన విషయం తెలిసిందే. .
ఎడ్వంచర్ టూరిజానికి అనుకూలం...
అనంతగిరి అటవీ ప్రాంతంలో 1,654 హెక్టార్లలో అపారమైన ప్రకృతి సంపద, ఔషధ మొక్కలు ఉన్నాయి. వివిధ వన్యప్రాణులు, వందల రకాల పక్షులు, రకరకాల సీతాకోక చిలుకలున్నాయి. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు జంగిల్ రిసార్ట్స్‌తో పాటు ఎడ్వంచర్ టూరిజం అభివృద్ధి పరిస్తే పర్యాటకులు పెరగనున్నారు. ఆఽధ్యాత్మిక కేంద్రంగా, సందర్శకులకు ఆహ్లాదం, ఆరోగ్యం పంచే ప్రాంతంగా పేరొందిన అనంతగిరి కొండలను వివిధ రకాల సాహస కృత్యాలకు నిలయంగా మార్చితే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. స్థానికులకూ ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. మౌంటెన్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, డిర్ట్ బైక్స్, సైకిల్ ట్రాప్, జిప్‌లైన్స్, నేచర్ ట్రెక్కింగ్, స్కై డైవింగ్, బ్యాక్ బ్యాకింగ్, క్యాంపింగ్, హైకింగ్, హార్స్‌బ్యాక్ రైడింగ్, స్కుబా డైవింగ్, సర్ఫింగ్, బర్డ్‌వాచింగ్, ఎకో టూరిజం, కెనోయింగ్, రివర్ క్రాసింగ్, అడ్వెంచర్ క్లబ్ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే అనంతగిరి రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
వారాంతపు విడిది కేంద్రం ...
అనంతగిరి కొండల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. రోజూ పని వత్తిళ్లతో మునిగి తేలే ప్రజలు సేదతీరేందుకు అనంతగిరి కొండలు అనువైన ప్రాంతం. లోతైన లోయలు, వంపులు తిరిగిన రోడ్డు మలుపులు, పచ్చని చెట్ల సమూహాలతో అనంతగిరి కొండలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడి వాతావరణం చూడగానే ఆకట్టుకునేలా ఉండడంతో పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అనంతగిరి కొండల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలోహరిత వ్యాలీ వ్యూ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టారు. సందర్శకుల కోసం కాటేజీలు, స్విమ్మింగ్ ఫూల్ కూడా నిర్మించారు. వారాంతంలో ఈ రిసార్ట్స్ సందర్శకులతో కిటకిటలాడుతుంది. పర్యాటకులు ఆన్‌లైన్‌లో గదులు రిజర్వు చేసుకుని ఇక్కడకు వస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఒక్క కాటేజీ కూడా ఖాళీ ఉండవు. ఇంకా ఎక్కువ సంఖ్యలో విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.