Share News

TIMS : జూన్‌ 2న సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభోత్సవం

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:46 AM

సనత్‌నగర్‌లో నిర్మితమవుతున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్‌ 2న ప్రారంభించనున్నారు.

TIMS : జూన్‌ 2న సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభోత్సవం

సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రారంభం

అప్పటికల్లా పనుల పూర్తికి చర్యలు

మావి స్కీంలు.. బీఆర్‌ఎ్‌సవి స్కాంలు

త్వరలో గోషామహల్‌ గ్రౌండ్స్‌లో ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ పనులు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, ఎర్రగడ్డ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్‌లో నిర్మితమవుతున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్‌ 2న ప్రారంభించనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రారంభింపజేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అప్పటివరకు పనులన్నింటినీ పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించామని, ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారం ఆయన సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ)లో టిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తాము స్కీంలను అమలుచేస్తూ ప్రజలకు చేరువవుతుంటే.. బీఆర్‌ ఎస్‌ మాత్రం స్కాంలు చేసుకుంటూ ప్రజల్లో ఆ పార్టీ అభాసుపాలు అవుతుందంటూ ఎద్దేవా చేశారు. విదేశాల్లో అందిస్తున్న విధంగానే రాష్ట్రంలోనూ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డులో రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి లేకుండా అత్యాధునిక పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. రోగులతో పాటు వచ్చే వారి రోగి సహాయకులు ఉండేందుకు ఆధునాతన సౌకర్యాలతో ‘ధర్మశాల’ను నిర్మిస్తున్నామని, వారికి భోజన వసతి కల్పించేందుకు ‘అక్షయపాత్ర’ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, రూ.5కే భోజనం అందిస్తామని చెప్పారు. వచ్చే రెండు మూడు నెలల్లో గోషామహల్‌ గ్రౌండ్స్‌లో ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడుతామన్నారు. పంజాగుట్టలో నిర్మించే నిమ్స్‌ అదనపు భవనాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌ పనులను వేగవంతం చేశామని, అల్వాల్‌ టిమ్స్‌ నిర్మాణంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని ముందుకువెళ్తున్నామని చెప్పారు. ఆయనవెంట ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్‌, సీఈలు రాజేశ్వరరెడ్డి, లింగారెడ్డితో పాటు ఎస్‌ఈ విశ్వకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 05:46 AM