Share News

రైతు భరోసాకు నిధుల భరోసా!

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:12 AM

రైతు భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్లు తెలిసింది.

రైతు భరోసాకు నిధుల భరోసా!

భూమి తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు

రుణం ఇవ్వడానికి ఐసీఐసీఐ బ్యాంకు సిద్ధం

ఆడిటింగ్‌ పూర్తి చేసి ఆర్‌బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసీ

ఈ నెలాఖరుకల్లా దక్కనున్న రుణం

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ఈ పథకానికి నిధుల సమీకరణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రైతు భరోసాకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధీనంలోని భూమిని తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. 9.6 శాతం వార్షిక వడ్డీతో రూ.10 వేల కోట్ల అప్పు ఇవ్వడానికి ఐసీఐసీఐ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా రుణం అందవచ్చని, జనవరి నుంచి అమలు చేసే రైతు భరోసా పథకానికి ఆ సొమ్మును వినియోగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కోకాపేట, రాయదర్గంలో టీజీఐఐసీ అధీనంలోని 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని భావించిన సర్కారు.. ఆ మేరకు భారత రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ)కు ప్రతిపాదనలు పంపింది. కానీ, వాటిని ‘ఆడిటింగ్‌’ కొర్రీతో ఆర్‌బీఐ వెనక్కి పంపింది. ఓవైపు ఈ ఆడిటింగ్‌ను కొలిక్కి తెచ్చే చర్యలు చేపడుతూనే మరోవైపు బ్యాంకుల కన్సార్షియంతో టీజీఐఐసీ సంప్రదింపులు జరిపింది. ఆడిటింగ్‌ను పూర్తి చేసి, ఆర్‌బీఐని ఒప్పించే పనిలో పడింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నెలాఖరులోగా రూ.10 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి 7000 మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వారికి చెల్లించే ప్రయోజనాల కోసం రూ.2000 కోట్లకు పైగా నిధులు కావాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రుణం తీసుకునేందుకు చర్యలు చేపడుతోంది.

Updated Date - Dec 11 , 2024 | 05:12 AM