Share News

మునిసిపాలిటీల్లో మళ్లీ గ్రేడింగ్‌ విధానం!

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:17 AM

మునిసిపల్‌ కమిషనర్ల నియామకంలో మళ్లీ గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

మునిసిపాలిటీల్లో మళ్లీ గ్రేడింగ్‌ విధానం!

దాని ప్రకారమే కమిషనర్ల నియామకం

2019లో గ్రేడ్లను రద్దు చేసిన అప్పటి సర్కార్‌

ఐఏఎస్‌ అధికారిని నియమించాల్సిన చోట గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 స్థాయి ఉన్న వారికి పోస్టింగ్‌

అభివృద్ధిపై ప్రభావం పడినట్లు గుర్తించిన

అధికారులు.. త్వరలో ప్రతిపాదనలు

హైదరాబాద్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కమిషనర్ల నియామకంలో మళ్లీ గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఆ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చర్చించినట్లు తెలిసింది. జనాభా, ఆదాయం బట్టి మునిసిపాలిటీలకు గ్రేడింగ్‌లు ఉండేవి. దాని ప్రకారమే అధికారులను నియమించేవారు. 2019లో కొత్త మునిసిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో గత ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసింది. దీంతో గ్రేడ్‌-3, గ్రేడ్‌-2 మునిసిపాలిటీల్లో పనిచేసే అర్హత ఉన్న అధికారులు పెద్ద మునిసిపాలిటీల్లో సైతం పోస్టింగులు తెచ్చుకునే అవకాశం ఏర్పడింది. రాజకీయ పలుకుబడి ఉన్న అధికారులు తమకు నచ్చినచోటుకు కమిషనర్‌గా వెళుతున్నారు. ఏ పైరవీ లేకపోతే చిన్న మునిసిపాలిటీలకు కూడా ఐఏఎ్‌సల నియామకాలు జరుగుతున్నాయి. దీంతో కీలకమైన నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించిన పురపాలక శాఖ ఉన్నతాధికారులు మళ్లీ గ్రేడింగ్‌ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.


ఆదాయం రూ.60 లక్షల్లోపు ఉంటే గ్రేడ్‌-3గా, రూ.కోటి పైన ఉంటే గ్రేడ్‌-2, రూ.2 నుంచి రూ.4 కోట్ల మధ్య ఉంటే గ్రేడ్‌-1, రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల మధ్య ఉంటే స్పెషల్‌ గ్రేడ్‌, రూ.6 నుంచి రూ.8 కోట్ల మధ్య ఉంటే సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా పరిగణిస్తారు. రూ.8 కోట్లపైన ఆదాయం, 3 లక్షల జనాభా ఉంటే కార్పొరేషన్‌గా ప్రకటిస్తారు. గతంలో మునిసిపాలిటీల స్థాయిని బట్టి అధికారుల నియామకం చేపట్టేవారు. గ్రేడింగ్‌ విధానం రద్దు చేసిన తర్వాత నిజాంపేట్‌, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌ వంటి కీలకమైన ప్రాంతాలకు గ్రేడింగ్‌తో నిమిత్తం లేకుండా పైరవీలు చేసుకున్న అధికారులకు పోస్టింగులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనుల మీద ప్రభావం పడుతుందనే చర్చ అధికారుల మధ్య జరుగుతోంది. నిజాంపేటలాంటి ప్రాంతాల్లో గతంలో ఐఏఎస్‌ స్థాయి అధికారి పనిచేసేవారు. ఇప్పుడు నాన్‌-ఐఏఎ్‌స అఽధికారులు, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 మునిసిపాలిటీల్లో పనిచేసే అర్హత ఉన్న వారిని నియమిస్తున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో 13 నగరపాలక సంస్థలు, 129 మునిసిపాలిటీలున్నాయి. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మునిసిపాలిటీలకు మళ్లీ గ్రేడింగ్‌ల విధానం అమలుచేయాలనే చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలోనే ఈ అంశంపై పురపాలక శాఖ సంచాలకులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.

Updated Date - Dec 11 , 2024 | 05:17 AM