Ponnam Prabhakar : ఉద్యమకారులు, యువత బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:21 AM
ఉద్యమకారులు యువత బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటు అయిందని, కేసీఆర్ తానే సాధించానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కేసీఆర్ తానే సాధించానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం
మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్
బర్కత్‌పుర, పంజాగుట్ట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యమకారులు యువత బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటు అయిందని, కేసీఆర్ తానే సాధించానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ జనసమితి అనుబంధ యువజన, విద్యార్థి జనసమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూత్ డే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆర్థిక రంగాలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాల్జేశారని ఆరోపించారు. అమరులు త్యాగాలను కేసీఆర్ గౌరవించలేదని, నియంతగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రధాని మోదీ మాట్లాడితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించకపోవడం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమేనని ఆరోపించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై మోదీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. ఆయన వర్ధంతిని యూత్ డే గా ప్రకటించాలనేది న్యాయమైన డిమాండ్ అని ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ యువత త్యాగాలతోనే సాధ్యమైందని, వారి ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడమే మన ముందున్న బాధ్యత అన్నారు. ఈ సదస్సు టీజేఎస్ యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా అధ్యక్షత వహించగా నాయకులు రవి, వీరన్న, రవినాయక్, ప్రశాంత్, శేఖర్‌యాదవ్, నరేందర్, మహ్మద్ వాసీమ్, డప్పు గోపి, పాల్గొన్నారు. '
ఉద్యమకారులను కేసీఆర్ వంచించారు
తెలంగాణ ఉద్యమకారులను, ప్రజలను కేసీఆర్ వంచించారని, రాజకీయాల కోసమే తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. తెలంగాణ కోసం సావునోట్లో తలకాయ పెట్టానని కేసీఆర్ చెప్తారని, అయితే అంతా డ్రామానేనని గజ్జెల కాంతం అన్నారు.