విపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:25 AM
ఎస్‌ఐబీలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావు బీఆర్‌ఎస్ హయాంలో విపక్ష నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై నిఘా విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడంపై

డీఎస్పీ ప్రణీత్‌రావుపై క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధం
సహకరించిన వారిపైనా చర్యలు
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐబీలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావు బీఆర్‌ఎస్ హయాంలో విపక్ష నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై నిఘా విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడంపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్‌రావు పాత్ర ప్రాథమికంగా రూఢీ అవ్వడంతో డీజీపీ రవిగుప్తా అతణ్ని సోమవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే..! సస్పెన్షన్‌కు ముందు వరకు ఆయన సిరిసిల్లా జిల్లాలో డీసీఆర్‌బీ(ఫంక్షనల్ వర్టికల్స్) విభాగం డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్‌రావు స్పెషల్ ఆపరేషన్ టీం(ఎ్‌సవోటీ)కి నేతృత్వం వహించారు. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు డీజీపీ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు.. ప్రణీత్‌రావు ఆధారాలను ధ్వంసం చేసినట్లు నిఘా విభాగం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఆ రోజు ఓ ఎలక్ట్రిషియన్ సాయంతో సీసీ కెమెరాలను నిలిపివేసి, లాగర్ రూంలో ఉన్న 42 హార్డ్ డిస్క్‌లను దహనం చేసినట్లు తేల్చింది. ఎస్‌వోటీ విభాగంలో ఉన్న డెస్క్‌టా్‌పలు, ల్యాప్‌టా్‌పలలోని సమాచారాన్ని కూడా తుడిచిపెట్టినట్లు నిర్ధారించింది. అప్పట్లో విపక్ష నేతలకు సంబంధించి సేకరించిన కాల్ డేటా రికార్డ్(సీడీఆర్)లు, ఐఎంఈఐ నంబర్లు.. ఇలా వందల సంఖ్యలో ఫైళ్లు, కీలకమైన డేటా ఆ కంప్యూటర్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను ప్రాథమికంగా నిర్ధారించుకున్నాకే.. ప్రణీత్‌రావును సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విచారణ పూర్తయ్యేదాకా ప్రణీత్‌రావును రాజన్న-సిరిసిల్ల జిల్లా దాటరాదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అని డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రణీత్‌రావు కుట్రపూరితంగా ఫోన్లను ట్యాప్ చేయడం వల్ల త్వరలో అతనిపై క్రిమినల్ కేసులను నమోదు చేసే దిశగా దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల రోజు ఎస్‌ఐబీ కార్యాలయంలో సీసీ కెమెరాలను నిలిపివేసేందుకు ప్రణీత్‌రావుకు సహకరించిన ఎలక్రిషియన్, ఇతర సిబ్బందినీ నిఘా విభాగం అధికారులు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు సిబ్బంది పైనా శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు.
ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లలో ఏముంది?
ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన 42 హార్డ్ డిస్క్‌లలో ఏముంది? ఇప్పుడు ఈ అంశంపైనే నిఘా విభాగం దృష్టి సారించింది. ఎస్‌వోటీలో మావోయిస్టులపై నిఘాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. మావోయిస్టుల పేర్లు చెప్పి.. కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రముఖుల కాల్స్‌ను ప్రణీత్‌రావు ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే.. ప్రణీత్‌రావు తాను ట్యాప్ చేసిన వివరాలతోపాటు.. మావోయిస్టులు, ఉగ్రవాదులకు సంబంధించిన డేటాను కూడా తుడిచిపెట్టి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయాల్సిన అవసరమేమొచ్చిందనే అంశంపై అధికారులు దృష్టిసారించారు.
మరోసారి చర్చనీయాంశమైన ట్యాపింగ్..
ప్రణీత్‌రావు ఉదంతంతో మరోమారు ఫోన్‌ట్యాపింగ్ అంశం చర్చనీయాంశమైంది. నిజానికి ఒక వ్యక్తి ఫోన్‌ను ట్యాప్ చేయాలంటే.. దర్యాప్తు సంస్థలు ముందుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలోనూ ఈ అంశంపై కాంగ్రె్‌స-బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే..! మొయినాబాద్ ఫామ్‌హౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనూ నందకుమార్ ముందు నుంచి తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపిస్తూ వచ్చారు. రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఏకంగా తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ప్రణీత్‌రావు అంశంతో ఈ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది.