Share News

తెలంగాణలో ప్రచారానికి తమిళి ‘సై’

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:44 AM

నిన్నటి దాకా రాష్ట్ర గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన తమిళి సై సౌందర రాజన్‌.. ఇప్పుడు బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారు.

తెలంగాణలో ప్రచారానికి తమిళి ‘సై’

నిన్న గవర్నర్‌.. నేడు బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌

తమిళిసై సహా 40 మంది నేతలతో బీజేపీ జాబితా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): నిన్నటి దాకా రాష్ట్ర గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన తమిళి సై సౌందర రాజన్‌.. ఇప్పుడు బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని పలు సందర్భాల్లో తప్పుబట్టి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన ఆమె.. ఇప్పుడు కొత్త పాత్రలో తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో తెలుగు భాష కూడా కొద్దికొద్దిగా నేర్చుకున్న తమిళిసై.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాట ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న తమిళిసై.. ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మింగుడుపడని నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 24న ఆమె గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి తమిళనాడులో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన సంగతి విదితమే. తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తమిళిసైకి పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించింది.

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే..

ప్రధాని మోదీ, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, శివప్రకాశ్‌, సునీల్‌ బన్సల్‌, అభయ్‌ పాటిల్‌, కిషన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, నిర్మలా సీతారామన్‌, అర్జున్‌ ముండా, ఎల్‌.మురుగన్‌, యోగి ఆదిత్యనాథ్‌, డాక్టర్‌ మోహన్‌యాదవ్‌, భజన్‌లాల్‌ శర్మ, ప్రమోద్‌ సావంత్‌, దేవేంద్ర ఫడణవీస్‌, లక్ష్మణ్‌, బండి సంజయ్‌, డీకే అరుణ, పి.మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఈటల రాజేందర్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, కె. అన్నామలై, తమిళి సై సౌందర రాజన్‌, తేజస్వి సూర్య, టి. రాజాసింగ్‌, జి. ప్రేమేందర్‌రెడ్డి, డి. ప్రదీ్‌పకుమార్‌, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఖుష్బూ సుందర్‌, రాధిక శరత్‌ కుమార్‌, జీవిత రాజశేఖర్‌.

Updated Date - Apr 24 , 2024 | 04:45 AM