Share News

మేడిగడ్డ రక్షణకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:59 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని, రానున్న వరదల్లో బ్యారేజీలు దెబ్బతినకుండా నష్ట

మేడిగడ్డ రక్షణకు చర్యలు తీసుకోండి

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు కూడా..

తదుపరి నష్టం జరగకుండా చూసుకోవాలి

నీటిపారుదల శాఖ అధికారులకు జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ సూచన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని, రానున్న వరదల్లో బ్యారేజీలు దెబ్బతినకుండా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌.. నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. ఈ బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)లో నిర్లక్ష్యంతోపాటు నాణ్యతపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను ఎంక్వయిరీ ఆఫ్‌ కమిషన్‌గా నియమించిన విష యం తెలిసిందే. శనివారం కోల్‌కతాకు వెళ్లేముందు ఆయన అధికారులతో సమావేశమయ్యారు. మే నెలాఖరున లేదా జూన్‌లో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం లో బ్యారేజీలు మరింత దెబ్బతినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక కోసం కమిటీ చైౖర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు జస్టిస్‌ చంద్రఘోష్‌ సూచించారు. ఆ నివేదికను వెంటనే తెప్పించుకొని దాని ఆధారంగా బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. తమ విచారణలో ఈ నివేదిక కూడా కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 06:57 AM