Share News

బెల్టు తీసేనా!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:01 AM

పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా అక్రమ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఏ వీధిలో చూసినా బెల్టుషాపులే దర్శనమిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన బెల్టు దుకాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాయి.

బెల్టు తీసేనా!

యథేచ్ఛగా వీధికో బెల్టు దుకాణం

నిద్రమత్తులో ఎక్సైజ్‌ అధికారులు

తమ పరిధి కాదంటూ దాటవేస్తున్న పోలీసులు

ఎన్నికల సమయంలో అక్రమ కేసులు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 18: పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా అక్రమ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఏ వీధిలో చూసినా బెల్టుషాపులే దర్శనమిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన బెల్టు దుకాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నాయకులు గ్రామాల్లో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని వాగ్దానాలు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరోవైపు ఎక్సైజ్‌ అధికారులు గానీ, పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పోలీసు అధికారులను ప్రశ్నిస్తే అది తమ పరిధి కాదని దాటవేస్తున్నారు. అలా చెప్తూనే బెల్టు షాపులు, వైన్స్‌ షాపుల వద్ద జిల్లాలోని పలువురు పోలీసులు చేతులు చాచుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బెల్టుషాపులు లేవంటూ సమాధానాలు

పట్టణాలు, గ్రామాల్లో ఉదయం, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా అవి కాకీలెక్కలుగానే మిగులుతున్నాయి. నూతనంగా ఎక్సైజ్‌ శాఖ మద్యంపాలసీని తీసుకు వచ్చి ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించేలా కల్తీమద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. ఒక్కో గ్రామంలో 10బెల్టుషాపులు ఉన్నాయంటే అక్రమమద్యం ఏమేర ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్‌ మండలంలోని మైలార్‌ దేవరంపల్లి, మద్గుల్‌ చిట్టంపల్లి, సిద్దులూరు, పూడురు మండలం చీలాపూర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.

ఎనీటైం మద్యం

గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటున్నాయి. గ్రామాల్లోని కూలీలు మద్యానికి బానిసలై పనులకూ వెళ్లకుండా బెల్టుషాపుల్లోనే తాగితూగుతున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణా షాపులు బెల్టుషాపుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. రహదారుల వెంబడి మద్యాన్ని విక్రయించొద్దని నిబంధనలున్నా గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు. వ్యాపారులు అటు పోలీసులకు ఇటు ఎక్సైజ్‌ అధికారుల చేతులు తడిపి తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ర వెల్లువెత్తుతున్నాయి.

అధికారులపై విమర్శలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సంతోష్‌కుమార్‌ తన కుమారుడి జన్మదిన సందర్భంగా మన్నెగూడకు వచ్చి మద్యం కొనుగోలు చేశాడు. ఎక్సైజ్‌ శాఖ చట్టం 1968 ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఆరు సీసీలు మద్యం ఓ కార్టన్‌ బీర్లు ఉండవచ్చు. కారులో నాలుగు కార్టన్ల బీర్లు, నలుగురు వ్యక్తులు ఉన్నారు. తనిఖీ చేసిన అధికారులు మాత్రం కారులో ఉన్న ముగ్గురిని మినహాయించి ఒక్కరిపైనే కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారులకు లెక్కలు చూపడానికే తప్ప నిబంధనలు పాటించని అసలైన వ్యక్తులపై కేసులు నమోదు చేయడంలేదని పలువురు మండిపడుతున్నారు.

బెల్టు షాపులను మూయిస్తాం: రఘవీణ, వికారాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ

గ్రామాల్లో, ఆయా కాలనీల్లో ఉన్న బెల్టుషాపులపై దృష్టిపెట్టి వాటిని తొలగిస్తాం. గ్రామాల్లో ఎవరైనా మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 19 , 2024 | 12:01 AM