Share News

పాపాలపుట్ట పగిలింది

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:30 AM

గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని భూదాన్‌ భూములకు సంబధించిన పాపలపుట్ట పగిలింది. కొందరు బడాబాబులు దొడ్డిదారిన స్వాహా చేసిన ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌ శశాంక

పాపాలపుట్ట పగిలింది

వట్టినాగులపల్లి భూదాన్‌ భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

హైకోర్టులో ఉన్న కేసులు తేలేవరకూ అన్ని రకాల క్రయవిక్రయాలూ నిలిపివేయండి

ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి.. అధికారులకు కలెక్టర్‌ శశాంక ఆదేశం

నిషేధిత జాబితాలో బోయినపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా, హీరోశ్రీకాంత్‌ తదితరులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని భూదాన్‌ భూములకు సంబధించిన పాపలపుట్ట పగిలింది. కొందరు బడాబాబులు దొడ్డిదారిన స్వాహా చేసిన ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. గతంలో హైకోర్టు ఈ భూములపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఈ భూములను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో పెట్టాలని.. హైకోర్టులో ఈ భూములపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ తేలేవరకూ అన్నిరకాల క్రయవిక్రయాలూ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వట్టినాగులపల్లిలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 29.27 ఎకరాల భూదాన్‌ భూములను.. అధికారబలంతో అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు చెరబట్టడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘ధరణి బూచితో భూమి స్వాహా’, ‘భూదాన భూముల్లో కాలనాగులు’ కథనాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై వెంటనే స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక.. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈమేరకు గండిపేట తహశీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం ఆ భూములను పరిశీలించి సర్వే నిర్వహించింది. డ్రోన్‌ సర్వే ద్వారా నిర్మాణాలు, భూముల సరిహద్దులు గుర్తించడమే కాక.. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూదాన్‌ భూములకు సంబంధించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనే విషయాలపై విచారణ జరిపి కలెక్టర్‌కు సమగ్ర నివేదికను అందజేసింది. అందులో.. ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చిన అనేక మంది ప్రముఖుల పేర్లు ఉండడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ సోదరుడు, ప్రతిమ కన్‌స్ట్రక్షన్‌అధినేత బోయినపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సినీ హీరో మేక శ్రీకాంత్‌, బీజేపీ నాయకురాలు చందుపట్ల కీర్తిరెడ్డి పేర్లు ఇందులో ఉన్నాయి. అలాగే మరికొందరు బడావ్యక్తులు కూడా ఇక్కడ బినామీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో గ్రేటర్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ వారెక్కడా తెరపైన కనిపించకుండా కొందరికి అనుకూలంగా వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఉన్నవారిలో ఒకరిద్దరు వ్యక్తులు పాతికేళ్ల క్రితం తెలిసోతెలియకో ఈ భూములు కొన్నట్టు సమాచారం.

పల్లా ఇపుడు ఏం చెబుతారు?

ఈ భూముల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని పేర్కొంటూ.. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలను ఖండిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. తాను సర్వే నంబర్‌ 188/1/1/2లో కొనుగోలు చేసిన 1.10 ఎకరాలు కూడా భూదాన్‌ భూమి కాదని ఆయన తెలిపారు. కానీ, ఇపుడు భూదాన్‌ భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకుని దొడ్డిదారిన పాస్‌బుక్‌లు పొందిన వారి జాబితాలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఏమంటారో చూడాల్సి ఉంది. అలాగే ఆయన 2014లో భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే 2021 వరకూ ఎందుకు పహాణీల్లో నమోదు కాలేదు? ధరణి వచ్చాకే2021లో పాస్‌బుక్‌ ఎలా వచ్చిందనే విషయాలకు సమాధానం లేదు. 2021 జూన్‌ 6న అప్పటి కలెక్టర్‌ ఈ 29.27 ఎకరాల భూదాన భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టినా కూడా ఆగస్టు 24న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సర్వేనంబరు 188/1/2 పేరుతో పట్టాదార్‌ పాస్‌బుక్‌ జారీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సర్వేనంబర్లు సబ్‌డివిజన్‌ కాలేదని, ఎంజాయిమెంట్‌ సర్వే జరగలేదని అఽధికారులు చెబుతున్నారు. కానీ అన్ని నిబంధనలు తుంగలొ తొక్కి హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను అధికార అండతో పెద్దలంతా స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో.. ఈ భూముల క్రయవిక్రయాలను నిలిపివేస్తే సరిపోదని.. ధరణిలో లొసుగులను అడ్డుపెట్టుకుని బడాబాబులు దొడ్డిదారిన తీసుకున్న కొత్త పట్టాదార్‌ పాస్‌బుక్‌లను రద్దుచేస్తేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 06 , 2024 | 04:30 AM