Share News

Manchiryāla- సూర్య ప్రతాపం

ABN , Publish Date - May 29 , 2024 | 11:00 PM

మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బుధవారం జిల్లాలోని కాసిపేట మండలం కొండాపూర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయానికి కాసిపేట మండలం కొండాపూర్‌లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం.

Manchiryāla-         సూర్య ప్రతాపం
లోగో

- 46 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రతలు

- వడదెబ్బతో ముగ్గురి మృతి

మంచిర్యాల, మే 29 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బుధవారం జిల్లాలోని కాసిపేట మండలం కొండాపూర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయానికి కాసిపేట మండలం కొండాపూర్‌లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. అలాగే వేమనపల్లి మండలం నీల్వాయిలో 46, బెల్లంపల్లిలో 45.8 హాజీపూర్‌, నెన్నెల మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రెడ్‌ అలెర్ట్‌ జారీతో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కన్నెపల్లి మండలంలో 44.9, దండేపల్లి మండలం వెల్గనూరులో 44.5, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో 44.3, కోటపల్లి, లక్షెట్టిపేట, భీమారం మండలాల్లో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి. భీమిని మండలంలో 44.1, మందమర్రి, చెన్నూరు మండలాల్లో 44, జన్నారం మండలంలో 43.9 తాండూరు మండలంలో 43.7 జైపూర్‌ మండలంలో 42.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడదెబ్బతో ముగ్గురి మృతి

నెన్నెల, మే 29: జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. నెన్నెల మండల కేంద్రానికి చెందిన హమాలీ తోట తిరుపతి(36) బుధవారం వడదెబ్బతో మృతిచెందాడు. పోలీసులు, సహచర కూలీలు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి, మరో ఐదుగురు హమాలీలు కన్నెపల్లి మండలం ఖాజీపల్లికి ధాన్యం బస్తాల లోడింగ్‌కు వెళ్లాడు. కళ్లంలోనే ధాన్యం తూకం వేస్తుండగా హఠత్తుగా కిందపడి స్పృహ కోల్పోయాడు. తోటి హమాలీలు చెట్టు నీడకు తీసుకెళ్లి నీరు తాగిస్తుండగా కన్నుమూశాడు. ఎండ వేడి తట్టుకోలేక తిరుపతి మృతిచెందాడని హమాలీలు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గంగారాం తెలిపారు. తిరుపతికి భార్య శ్రీలత, కుమారులు శ్రేయాన్‌, హర్షవర్ధన్‌ ఉన్నారు.

హాజీపూర్‌: మండలంలోని ముల్కల్ల గ్రామానికి చెందిన కునారపు ఐలయ్య (36) అనే యువకుడు వడదెబ్బతో బుధవారం మృతిచెందాడు. ఐలయ్య మంగళవారం మేకలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరిన ఐలయ్య అకస్మాత్తుగా కింద పడ్డాడు. కుటుంబీకులు మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఐలయ్యకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

తాండూర్‌: మండలంలోని అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన టేకం భీంరావ్‌ (26) అనే యువకుడు వడదెబ్బతో మృతిచెందినట్లు మాదారం ఎస్సై అనూష తెలిపారు. భీంరావ్‌ సోమవారం తన స్నేహితులో కలిసి సోనాపూర్‌ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్న అనంతరం వాంతులు కావడంతో కుటుంబీకులు బుధ వారం ఉదయం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందినట్లు తెలిపారు. భీంరావ్‌ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పెద్దనాన్న టేకం దోభి వద్ద ఉంటున్నాడు. మృతుని పెద్దనాన్న టేకం దోభి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 11:00 PM