Share News

సూర్యప్రతాపం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:29 PM

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు ఉగ్రరూపం దాలుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆరు గంటలకు ముందే ఉదయిస్తున్న సూరీడు భగభగ మండుతున్నాడు.

సూర్యప్రతాపం

మండుటెండలతో బెంబేలు 8 ఉక్కిరిబిక్కిరవుతున్న జీవులు

అత్యధికంగా కోట్‌పల్లిలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వికారాబాద్‌, ఏప్రిల్‌25 (ఆంధ్రజ్యోతి) : పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు ఉగ్రరూపం దాలుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆరు గంటలకు ముందే ఉదయిస్తున్న సూరీడు భగభగ మండుతున్నాడు. రాత్రి తొమ్మిది గంటలవుతున్నా వేడి తగ్గకపోవడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మండుతున్న ఎండలతో ఉదయం పది గంటలు దాటిన తరువాత ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఎండలు ఈ విధంగా ఉంటే మే నెలలో ఎండలు మరెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఉష్ణోగతలతో ఆరు బయట పనిచేసే వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో భవన కార్మికులు, ఉపాధి కూలీలు పనులకు హాజరయ్యేందుకు వెనకాడుతున్నారు. ప్రచండభానుడు ఉగ్రరూపం దాలుస్తుండడంతో వికారాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో 29 ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల్లో 14 చోట్ల 40 డిగ్రీలకు పైగానే నమోదు కావడం గమనార్హం. గురువారం జిల్లాలో కోట్‌పల్లిలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోమిన్‌పేట్‌లో 41.7 డిగ్రీలు, బంట్వారం మండలం, నాగారంలో 41.6 డిగ్రీలు, కులకచర్ల మండలం, పుట్టపహడ్‌, పూడూరు మండలం, మన్నేగూడ, మర్పల్లిల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మర్పల్లిలో 41.5 డిగ్రీలు, బంట్వారంలో 41.5 డిగ్రీలు, దౌల్తాబాద్‌లో 40.9 డిగ్రీలు, వికారాబాద్‌లో 40.8, కులకచర్ల మండలం, ముజాహిద్‌పూర్‌లో 40.6 డిగ్రీలు, పెద్దేముల్‌లో 40.6 డిగ్రీలు, పరిగి మండలం, రాపోల్‌లో 40.2 డిగ్రీలు, ధారూరులో 40.2 డిగ్రీలు, దుద్యాల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బషీరాబాద్‌ మండలం, కాశీంపూర్‌లో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోయ్యాయి. మూడు, నాలుగు రోజలుగా జిల్లాలో సూర్యప్రతాపం చాలా అధికంగా ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా బెంబేలెత్తే విధంగా నమోదవుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:29 PM