మిషన్‌భగీరథపై సర్వే!
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:39 PM
గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. గత ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది.

క్షేత్రసాయిలో నీటి సరఫరాపై ఆరా
మేడ్చల్ జూన్ 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. గత ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది. మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఆశించిన మేర మిషన్‌భగీరథ నీటి సరఫరా కావడం లేదు. కొన్ని చోట్ల పూర్తికాని పైపులైన్ల నిర్మాణం, ఓవర్‌హెడ్ ట్యాంకులు, అక్కడక్కడ పైపులైన్ల లీకేజీతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రతి ఇంటికి అవసరాలకు సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. మరికొన్ని ఇళ్లల్లో ఇంకా నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. 2015లో ఈ పథకం ప్రారంభించగా అప్పుడు ఉన్న ఇళ్ల గణాంకాల ప్రకారం పైపులైన్ నిర్మించిన నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా ఎలా ఉంది? అనే అంశాలపై కొత్త ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శితో పాటు పంచాయతీల్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. గ్రామాల్లో పైపులైన్లు పటిష్టంగా ఉన్నాయా..? ట్యాంకుల ద్వారా ప్రతి నల్లాకు నీరు చేరుతుందా? ఎన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు? ఆ కుటుంబాల్లోని సభ్యులకు సరిపడా నీరు అందుతుందా? ఇంకా ఎంతమందికి కనెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది? అనే అంశాలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించి ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. యాప్ ద్వారా సర్వే ప్రక్రియను చేపట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగుతుంది..
జిల్లాలో మిషన్‌భగీరథ పథకం ద్వారా ఎంతమందికి శుద్ధ్ది చేసిన నీరు సరఫరా అవుతుంది. ఇంకా ఎన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలనే విషయాలను గుర్తించేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. కొత్తగా ఎన్ని ఇళ్లు నిర్మించారనే వివరాలను కూడా సేకరిస్తున్నాం.
- వెంకయ్య, జిల్లా పంచాయతీ అధికారి
మిషన్ భగీరథ సర్వేపై నిర్లక్ష్యం .. 21మంది కార్యదర్శులకు మెమోలు జారీ
తాండూరు రూరల్, : విఽఽధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శులపై వికారాబాద్ జిల్లా, తాండూరు ఎంపీడీవో విశ్వప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు.గ్రామాల్లో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే చేయాలని పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సర్వేలో కార్యదర్శులు ప్రతి ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ నీటి సరఫరాలపై సమగ్ర వివరాలు సేకరించారు. లబ్ధిదారుడి ఫొటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అయితే తాండూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఈ సర్వేపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక్కో కార్యదర్శి 50కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, కొందరు కార్యదర్శుల సర్వే జీరో ఉండడంతో 33 మంది కార్యదర్శుల్లో 21మంది కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో విశ్వప్రసాద్ తెలిపారు. అదేవిధంగా మరో ఆరుగురు కార్యదర్శులు మోన్యానాయక్, అమరేశ్వరి, ఇస్మాయిల్, శృతి, అంబిక, ప్రవీణ విధి నిర్వహణలో పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మూడు రోజుల్లో వారు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఎంపీడీవో తెలిపారు.