ఈ దుస్థితికి మోదీ కాదు.. మనమే కారణం
ABN , Publish Date - Mar 10 , 2024 | 03:54 AM
రాష్ట్రపతి ఉపన్యాసంలోనూ రాజకీయ నాయకులను కీర్తించే విచిత్ర విన్యాసం దేశ ప్రజలు మొట్టమొదటి సారిగా చూస్తున్న సందర్భం అని సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కువసార్లు తమకు అనుకూలంగా తీర్పులు వెలువడినా, ఎలక్ర్టోరల్ బాండ్ల
రామ మందిరాన్ని భారత ఆత్మగా చెప్పడం శోచనీయం
ప్రముఖ గాంధేయవాది హర్ష మందర్
రాష్ట్రపతి ప్రసంగంలోనూ రాజకీయ నాయకులను కీర్తించడమా?: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
పత్రికా స్వేచ్ఛలో ఆప్ఘానిస్థాన్ కన్నామనం వెనుకంజలో ఉన్నాం: కె.శ్రీనివాస్
పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభ
వివిధ అంశాలపై ప్రసంగించిన మేధావులు, రచయితలు
ఫాసిజాన్ని ఓడిద్దాం..హక్కులకై పోరాడదామని పిలుపు
హైదరాబాద్ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉపన్యాసంలోనూ రాజకీయ నాయకులను కీర్తించే విచిత్ర విన్యాసం దేశ ప్రజలు మొట్టమొదటి సారిగా చూస్తున్న సందర్భం అని సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కువసార్లు తమకు అనుకూలంగా తీర్పులు వెలువడినా, ఎలక్ర్టోరల్ బాండ్ల రద్దు వంటి ప్రతికూల తీర్పు పట్ల అసహనం వ్యక్తం చేయడం ప్రస్తుతం చూస్తున్నామని విమర్శించారు. సర్జికల్ స్ట్రయిక్ గగనతల దాడులు, బుల్ డోజర్ ప్రయోగాల దాకా ఫాసిజం చేరిందని ఎద్దేవా చేశారు. పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభలు శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభయ్యాయి. తొలిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..’’నిర్బంధ చట్టాలు-న్యాయ వ్యవస్థ’’ అనే అంశంపై ప్రసంగించారు. తొంభైశాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాకు ఆరోగ్య ప్రాతిపదికన బెయిల్ నిరాకరించడం న్యాయవ్యవస్థలో ఓ విషాద ఘట్టమని సుదర్శన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పాలకులకు రాజ్యాంగ విలువల పట్ల అవగాహన లేదని, ప్రజలే పోరాడి హక్కులను సాధించుకోవాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రముఖ గాంధేయవాది హర్ష మందర్.. దేశవ్యాప్త హక్కుల పరిస్థితిపై ప్రసంగించారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు స్వతంత్ర భారత్‌లోనే అత్యంత కీలకమైనవిగా అభివర్ణించారు. తొలితరం నేతలు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఆత్మగా భావిస్తే, నేటి పాలకులు మాత్రం రామ మందిరాన్ని భారత ఆత్మగా ప్రకటించడం శోచనీయమన్నారు. ముస్లింల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గణపతి మండపంలోని అరటి పండు తిన్నాడన్న నెపంతో నడిరోడ్డు మీద ఓ పిల్లాడిని అందరూ చూస్తుండగానే అల్లరిమూక కొట్టి చంపిన ఘటనను గుర్తుచేశారు. ఒక్కరు కూడా ఆ పిల్లాడిని కాపాడేందుకు ప్రయత్నించక పోవడం... అన్యాయానికి సమాజంలో మద్దతు పెరిగిందనడానికి నిదర్శనమన్నారు. దేశంలో ఈ దుస్థితి దాపురించడానికి మోదీ కాదు, మనమే కారణమంటూ హర్ష మందిర్ ఆవేదన చెందారు. ఈ దేశాన్ని 2047నాటికి హిందూ రాజ్యంగా మార్చేందుకు అవసరమైన వ్యూహరచనలో ఆర్‌ఎస్సెస్ ఉందని, దాన్ని తిప్పికొట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోడానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీని ఓడించడమే తగిన పరిష్కారమని హర్ష మందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
’ది వైర్’ అసిస్టెంట్ ఎడిటర్ ఇర్ఫాన్ ఖునుమ్ షేర్వాణి ’’మతం- రాజ్యాంగం- పౌరహక్కులు.. అంశంపై మాట్లాడారు. ఉత్తరాదిన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా కాలరాస్తున్నారని, అందుకు భిన్నంగా దక్షిణాదిన కాస్తంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నట్టుగా అనిపిస్తుందన్నారు. ఢిల్లీలో నమాజు చేసుకుంటున్న వ్యక్తుల మీద పోలీసులు దాడి చేయడం, లవ్ జిహాద్ పేరుతో అమాయకులైన ముస్లింలను హింసించడం, ఇలాంటి అమానుషాలకు సామాజిక ఆమోదం లభించడం అత్యంత బాధాకరమని అన్నారు. కొందరు జడ్జీలు పదవీకాలం అనంతరం బీజేపీ ద్వారా పదవులు పొందుతున్నారంటూ న్యాయమూర్తుల తీరును ఎండగట్టారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె. శ్రీనివాస్ ’’పత్రికా స్వేచ్ఛ -నిర్బంధం’ అంశంపై ప్రసంగించారు. పత్రికా స్వేచ్ఛలో ఆప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకన్నా మనం వెనుకంజలో ఉన్నామని, గత పదేళ్లలో 15మంది జర్నలిస్టులు ఉపా చట్టం కింద నిందారోపణలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పత్రికా స్వేచ్ఛ విషయంలో ప్రాంతీయ మీడియా కన్నా జాతీయ మీడియా కాస్త మెరుగ్గా ఉండేదని, ఇప్పుడు ప్రాంతీయ మీడియానే కాస్త నయం అన్నట్టుగా పరిస్థితి మారిందన్నారు. జాతీయ మీడియా రానురాను స్వతంత్రతను కోల్పోతున్నదని కె.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు తమకు నచ్చని పత్రికలకు ప్రకటనలు ఇవ్వకపోవడం, దాడులు చేయడం లాంటి విపరీత పోకడలను ఈ మధ్యకాలంలో చూస్తున్నామన్నారు. ఫాసిస్టు ప్రమాదం మరింత పెరుగుతున్న క్రమంలో ప్రజానీకాన్ని మూక భావజాలం నుంచి విముక్తి చేయడం అత్యవసరమని కె. శ్రీనివాస్ నొక్కిచెప్పారు. అందుకు ప్రజలను ప్రభావితం చేయగలిగిన శక్తులన్నీ ఏకం కావాలని ఆకాంక్షించారు. ఢిల్లీ వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ మధు ప్రసాద్ ’’విద్య కాషాయికరణ’’ అంశంపై మాట్లాడుతూ... విద్య కాషాయికరణను శిశుమందిర్‌ల ఏర్పాటు ద్వారా 1952లోనే ఆర్‌ఎ్‌సఎస్ చేపట్టిందన్నారు. గాంధీ హత్యానంతరం వారి భావజాలం వైపు యువత కన్నెత్తి చూడకపోవడంతో శిశుమందిర్‌ల ద్వారా హిందూత్వను వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని ఆయన విమర్శించారు. పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సందర్భంగా తాము ఆదివారం ఊరేగింపు తీసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని సీఎల్‌సీ నాయకుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తెలిపారు. విద్యావేత్తగా, సామాజిక ఉద్యమ కారుడిగా, దేశ వ్యాప్తంగా పేరొందిన ప్రొఫెసర్ హరగోపాల్‌ను నక్సలైట్ మద్దతుదారుడు అని అనడమే కాకుండా, ఆయన పాల్గొంటారనే కారణంతో ఊరేగింపునకు అనుమతి ఇవ్వ లేమని పోలీసులు చెప్పడం హస్యాస్పదమన్నారు. పాలకులు మారినా నిర్బంధాలు మారలేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ప్రొఫెసర్ హరగోపాల్ స్పందిస్తూ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా రాజకీయ పార్టీలు ప్రవర్తించడం వాటి సహజ స్వభావమన్నారు. నాయకులకు జ్ఞాపకశక్తి తక్కువ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ర్యాలీకి అనుమతి నిరాకరించడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ మాఢభూషి శ్రీధర్, సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే, ప్రజాగాయని విమలక్క తదితరులు పాల్గొన్నారు.