Share News

DSC: 12 వేల కొలువులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jan 18 , 2024 | 04:26 AM

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులను చేర్చనుంది.

DSC: 12 వేల కొలువులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

మరో 7వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

12 వేల కొలువులతో మెగా డీఎస్సీ!

జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు

ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీ

కసరత్తు పూర్తి చేసిన అధికారులు

5వేల పోస్టులతో గతంలో నోటిఫికేషన్‌

అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు

మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు

కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు

ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులను చేర్చనుంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికేప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, వీటికి అదనంగా మరో 7వేల దాకా పోస్టులను చేర్చి.. మొత్తం సుమారు 12 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో టీచర్‌ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో పరీక్షలను వాయిదా వేశారు. వాటిని మళ్లీ ఎప్పుడు నిర్వహించే అంశాన్ని ప్రకటించలేదు. ఆ తరువాత ప్రభుత్వం మారిపోగా.. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తే... సాంకేతికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చింది. ముఖ్యంగా 1.77 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నందున.. వారి నుంచి ఆందోళన ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ సమస్య రాకుండా గత నోటిఫికేషన్‌కు అనుబంధంగా మరో నోటిఫికేషన్‌ జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో కొత్తగా చేర్చిన పోస్టుల వివరాలను పొందుపరిచి, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా..

మెగా డీఎస్సీలో సుమారు 12 వేల ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్‌ టీచర్‌ పోస్టులు 1,523 వరకు ఉంటాయి. అదనంగా మరో 4,281 ఖాళీ పోస్టులను గుర్తించారు. వీటితోపాటు మోడల్‌ స్కూళ్లలో మరో 1,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో పదోన్నతులు కల్పించడం ద్వారా మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని కూడా మెగా డీఎస్సీలో చేర్చనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. అయినప్పటికీ ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్‌ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. తాజాగా దీనిని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 26 వేల పాఠశాలలు ఉండగా.. వీటిలో సుమారు 6వేల స్కూళ్లలో ఏకోపాధ్యాయుడే ఉన్నారు. మరో 1,290 పాఠశాలల్లో ‘జీరో’ అడ్మిషన్లు నమోదయ్యాయి. వీటన్నింటిలో ఖాళీల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షలను రాష్ట్రం యూనిట్‌గా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్‌ జాబితాను రూపొందించి.. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టుల భర్తీ జరగనుంది.

ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం: కోమటిరెడ్డి

నల్లగొండ: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గ్రూప్స్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తామని, గత ప్రభుత్వంలో పేపర్‌ లీకులు జరిగినట్లుగా కాకుండా యూపీఎస్సీ తరహాలో వీటిని నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 07:17 AM