Share News

సప్లిమెంటరీ బిల్లులు మళ్లీ పాయె!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:40 AM

ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి సప్లిమెంటరీ బిల్లులను పరిష్కరించాలి. కానీ, 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం లభించలేదు.

సప్లిమెంటరీ బిల్లులు మళ్లీ పాయె!

మార్చి 31తో గడువు మీరిన బిల్లులు

పీఆర్సీ బకాయిలు, డీఏ సహా దాదాపు 30 వేల బిల్లులకు కాలదోషం

సీపీఎస్‌ ఉద్యోగులకు 2022 జనవరి డీఏకు మోక్షం లేదు

జీపీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లులూ ఇవ్వలే.. మెడికల్‌ రీయింబర్స్‌మెంటూ అంతే..

ప్రభుత్వాలు మారినా.. తీరని వెతలు.. ఉద్యోగులు, టీచర్లలో ఆందోళన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి సప్లిమెంటరీ బిల్లులను పరిష్కరించాలి. కానీ, 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం లభించలేదు. ఈ నెల 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) అమల్లోకి వచ్చింది. ఏ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన బిల్లులు ఆ ఏడాదిలోనే క్లియర్‌ కావాలి. మార్చి 31తో ముగిసిన ఏడాదికి బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో వాటికి కాలదోషం పట్టింది. వాటిని అధికారులు మళ్లీ తయారు చేయాలి. ఈ ప్రక్రియ రెండేళ్లుగా సాగుతూనే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం బిల్లులు సకాలంలో క్లియర్‌ కాకపోవడంతో 2023 మార్చి 31తో ల్యాప్స్‌ అయ్యాయి. అప్పట్లో వాటిని రీషెడ్యూలు చేశారు. అయినా 2023-24లోనూ ఆ బిల్లులు మంజూరు కాలేదు. ఇప్పుడు 2024 మార్చి 31 కూడా పూర్తయింది. మళ్లీ రీషెడ్యూలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి బిల్లులను రీ-షెడ్యూలు చేసుకోవాలంటూ ఆర్థిక శాఖ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయకపోవడం గమనార్హం. పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు మారినా.. తమ వెతలు తీరడం లేదని వాపోతున్నారు.

ఒకటా.. రెండా..?

పీఆర్సీ, డీఏ బకాయిల బిల్లులు, తెలంగాణ స్టేట్‌ గవర్న్‌మెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టీఎ్‌సజీఎల్‌ఐ), జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) పార్ట్‌ ఫైనల్‌, పీఆర్సీ గ్రాట్యుటీ రివైజ్డ్‌ బకాయిలు, కమ్యూటేషన్‌, సరెండర్‌ లీవ్స్‌, సెలవుల నగదీకరణ, మెడికల్‌ రీ-యింబర్స్‌మెంట్‌ వంటి బిల్లులన్నీ పెండింగే. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 30 వేల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇందులో కొన్ని 2021 నుంచి పెండింగ్‌లో ఉండగా మరికొన్ని 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బిల్లులను క్లియర్‌ చేయలేదని వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పరిస్థితి మారలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీ-షెడ్యూలు చేసిన బిల్లులూ మంజూరు కావడం లేదని చెబుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులతో సంబంధం ఉండే పీఆర్సీ, డీఏ బిల్లులకు ప్రతిసారీ కాలదోషం పడుతోంది. ఉద్యోగులకు 2018 సంవత్సరపు ‘వేతన సవరణ సంఘం (పీఆర్సీ)’ ఫిట్‌మెంట్‌ను 2021 జూన్‌ నుంచి ప్రభుత్వం అమలు చేసింది. అంటే.. జూన్‌ నుంచి పెరిగిన వేతనాలను జూలైలో చెల్లించింది. కానీ, ఏప్రిల్‌, మే జీతాలను 18 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. ఒక్కో ఉద్యోగికి పీఆర్సీ వ్యత్యాస సొమ్ము రూ.75 వేల వరకు రావాలి. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 3, 4 వాయిదాలను చెల్లించి, నిలిపివేసింది. 18 వాయిదాల ప్రకారం ఈ బకాయిలు 2022 డిసెంబరు నాటికల్లా ముగిసిపోవాలి. వీటికి సంబంధించి అధికారులు బిల్లులు చేసి ‘జిల్లా పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (డీపీఏవో)’కు పంపించారు. ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో 2023 మార్చి 31తో ల్యాప్స్‌ అయ్యాయి. మళ్లీ బిల్లులు తయారు చేసి, ఆర్థిక శాఖకు పంపినా ఫలితం లేకపోయింది. కరువు భత్యం (డీఏ) పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2022 జనవరికి సంబంధించిన డీఏ 3.64 శాతాన్ని ప్రభుత్వం 2023 జనవరిలో ప్రకటించింది. ఈ డీఏ బకాయిలను పాత పెన్షన్‌(ఓపీఎ్‌స) ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. అధికారులు బిల్లులు పంపుతున్నా క్లియర్‌ కావడం లేదు. మార్చి 31తో ల్యాప్స్‌ అవడంతో మళ్లీ తయారు చేయక తప్పదు.

ఇతర సప్లిమెంటరీ బిల్లులూ అంతే..

పీఆర్సీ, డీఏ బిల్లులే కాదు.. ఇతర సప్లిమెంటరీ బిల్లులూ క్లియర్‌ కావడం లేదు. బిల్లులను డీపీఏవోలకు పంపడం, అక్కడి నుంచి టోకెన్లు జనరేట్‌ కావడం సర్వసాధారణంగా మారింది. కానీ, బిల్లుల తాలూకు నగదు సొమ్ము మాత్రం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పడడం లేదు. ఒక ఉద్యోగికి ఏటా 15 వరకు ఆర్జిత సెలవులు(ఈఎల్‌) వస్తుంటాయి. వీటిని సంవత్సరాంతంలో ప్రభుత్వానికి అమ్ముకుంటే సగం నెల జీతం వస్తుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 300 వరకు ఈఎల్స్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తుంటారు. ఇందుకుగాను ఒక్కో ఉద్యోగికి దాదాపు 10 నెలల జీతం సొమ్ము రావాలి. వీటి బిల్లులను చేసి పంపిస్తున్నా, క్లియర్‌ కావడం లేదు. గత ప్రభుత్వం రిటైరైన ఉద్యోగుల పట్ల కూడా దయ చూపలేదు. బిల్లులను క్లియర్‌ చేయకుండా పథకాలకు నిధులు మళ్లించింది. పర్యవసానంగా సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం లభించలేదు. ఇక 20 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగి తన జీపీఎఫ్‌ నుంచి ‘పాక్షిక ఉపసంహరణ (పార్ట్‌ ఫైనల్‌)’ కింద 80 శాతం సొమ్మును తీసుకోవచ్చు. చాలా మంది ఉద్యోగులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం కోసం పాక్షిక ఉపసంహరణ బిల్లులు పెడితే.. అవి కూడా క్లియర్‌ కావడం లేదు. టీఎ్‌సజీఎల్‌ఐకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే బీమా సొమ్మును ఇవ్వాలంటూ చాలా మంది ఉద్యోగులు తమ బాండ్లను జీఎల్‌ఐ కార్యాలయంలో సమర్పించారు. అవీ క్లియర్‌ కావడం లేదు. దీని కింద ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష నుంచి 4 లక్షల వరకు చేతికందుతాయి. మొదటి పీఆర్సీ సిఫారసు మేరకు ఉద్యోగుల గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెరిగింది. ఉద్యోగి రిటైరవగానే ఈ సొమ్మును చెల్లించాలి. ఆ బిల్లులు కూడా క్లియర్‌ కావడం లేదు. దీంతో విశ్రాంత ఉద్యోగులు విభాగాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక ఉద్యోగుల ‘కమ్యూటేషన్‌’ బిల్లులూ విడుదల కావడం లేదు. ఒక ఉద్యోగి రిటైరవగానే.. 40 శాతం పెన్షన్‌ సొమ్మును వెంటనే తీసేసుకోవచ్చు. మిగతా 60 శాతం నుంచి ప్రతి నెలా కొంత చొప్పున పెన్షన్‌ అందుతుంది. కానీ, ఈ కమ్యూటేషన్‌ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్‌ రీ-యింబర్స్‌మెంట్‌ బిల్లుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు.

బిల్లులన్నీ క్లియర్‌ చేయాలి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్‌ కాలేదు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు అప్పట్లో రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లాయి. తాము అధికారంలోకి వస్తే సప్లిమెంటరీ బిల్లులను క్లియర్‌ చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఈ బిల్లులను క్లియర్‌ చేయాలి.

- చావ రవి, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

Updated Date - Apr 04 , 2024 | 05:40 AM