Share News

మల్కాజిగిరి నుంచి సునీత

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:50 AM

మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా మహేందర్‌ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్‌ రెడ్డిని, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను ఎంపిక చేశారు.

మల్కాజిగిరి నుంచి సునీత

చేవెళ్ల సీటు రంజిత్‌ రెడ్డికి.. సికింద్రాబాద్‌ నుంచి దానం

మరో ఏడు టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్‌

నాగర్‌కర్నూలులో మల్లు రవి.. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ

మెదక్‌ నుంచి నీలం మధు, నిజామాబాద్‌ జీవన్‌ రెడ్డి

ఇంకా ఆరు సీట్లు పెండింగ్‌లోనే.. రేపు ఖరారుకు చాన్స్‌

న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా మహేందర్‌ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్‌ రెడ్డిని, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను ఎంపిక చేశారు. ఇక, నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్‌ నుంచి నీలం మధు, నిజామాబాద్‌ నుంచి జీవన్‌ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. వెరసి, తెలంగాణలో మరో ఏడు స్థానాలకు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే నలుగురు అభ్యర్థుల (మహబూబ్‌నగర్‌-వంశీచంద్‌ రెడ్డి; మహబూబాబాద్‌- బలరాం నాయక్‌); జహీరాబాద్‌ - సురేశ్‌ షెట్కార్‌; నల్లగొండ - కుందూరు రఘువీర్‌ రెడ్డి)ను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మరో ఆరు స్థానాలను పెండింగ్‌ లో ఉంచింది. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం మంగళవారం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. సమావేశంలో తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీ్‌సగడ్‌, అండమాన్‌ నికోబార్‌, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన 85 మంది పేర్లపై చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 21న మిగిలిన ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Updated Date - Mar 20 , 2024 | 04:50 AM