Share News

భవ్య మృతదేహంతో కుటుంబసభ్యుల రాస్తారోకో

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:26 AM

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి లలిత, కృష్ణ దంపతుల కూతురు భవ్య(13) యాదాద్రి భవనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. భవ్య మృతదేహాన్ని ఆదివారం రాత్రి స్వగ్రామం బుధరావుపేటకు తీసుకువచ్చి,

భవ్య మృతదేహంతో కుటుంబసభ్యుల రాస్తారోకో

మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్‌

బుధరావుపేటలో అరగంట ట్రాఫిక్‌ జామ్‌

ఖానాపురం/భువనగిరిటౌన్‌, ఫిబ్రవరి 5: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి లలిత, కృష్ణ దంపతుల కూతురు భవ్య(13) యాదాద్రి భవనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. భవ్య మృతదేహాన్ని ఆదివారం రాత్రి స్వగ్రామం బుధరావుపేటకు తీసుకువచ్చి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. భవ్య మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. భవ్య అనారోగ్యంతో మృతి చెందిందని కాంగ్రెస్‌ నాయకులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మాధవ్‌గౌడ్‌ అక్కడికి చేరుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించి, భవ్య మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. కాగా భవ్య, వైష్ణవిల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. భవ్య మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిదండ్రుల అనుమతి లేకుండా మృతదేహాలను మార్చురీకి తరలించడం, ఇప్పటికీ స్పష్టమైన కేసు నమోదు చేయకపోవడంపై అనుమానం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళనలపై 20మందికి పైగా కేసు నమోదు

భువనగిరి హాస్టల్‌ విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్యలపై దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేసిన వివిధ పార్టీల నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు భట్టుపల్లి అనురాధ, బీఎస్పీ రాష్ట్ర నాయకులు భట్టు రాంచంద్రయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి రత్నపురం బలరాం, కిసాన్‌మోర్చ పట్టణ అధ్యక్షుడు పట్నం దిలీప్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోదీ రాందేవ్‌యాదవ్‌, మానవ హక్కుల సంఘం కార్యకర్త ఇష్రత్‌ అలీ, కుతాడి సురేశ్‌, మనోహర్‌, పెంట నితీష్‌, అమర్‌నాథ్‌, రావుల సంతోష్‌, శివకుమార్‌, తుమ్మల నగేష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 04:26 AM