Share News

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 10:55 PM

రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్‌ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- దీనివల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి

- యువత డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడాలి : కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జూలై 31 : రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్‌ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు. ఈ విషయంపై బధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్‌ కో-ఆర్డినేషన్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకై అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విద్యాలయాల వద్ద వంద మీటర్ల వ్యవధిలో ఎలాంటి పాన్‌ షాపులు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో నెల వారి పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌లో డ్రగ్స్‌ నిర్మూలన గురించి చర్చించాలని సూచించారు. విద్యాసంస్థలలో యాంటీ డ్రగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని, డ్రగ్‌ ఆనవాళ్లు ఉన్నట్లైతే అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలైతే డి-అడిక్షన్‌ సెంటర్లకు పంపి కౌన్సెలింగ్‌ ఇప్పించనున్నట్లు తెలిపారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ ఏరియాలలో గల వివిధ ఫార్మా కంపెనీలపై నిఘా ఉంచాలని, ప్రతీ నెల తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులు ఎవరైనా గంజాయి సాగు చేసిన, అంతరపంటగా వేసినా సంబంధిత రైతుల భూమిని జప్తు చేస్తారని తెలిపారు. జిల్లాలో డ్రగ్‌ సంబంధిత సమాచారం ఉన్నట్లైతే జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 8712659360కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బాబురావు అందరి మన్ననలు పొందారు : కలెక్టర్‌

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌) : పరిశ్రమల శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి మంచి అధికారిగా వి. బాబురావు అందరి మన్ననలు పొందారని జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మయూరి పార్కులో గల సమావేశ మందిరంలో నిర్వహించిన పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ వి. బాబురావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల శాఖలో అధికారిగా అంకిత భావం తో పనిచేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం తన భావి జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు. బాబురావు తన సర్వీసులో ప్రజలతో మమేకమై సేవలు అందించారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావుతో పాటు అధికా రులు, ఉద్యోగులు, మిత్రులు కొనియాడారు. కార్యక్రమంలో దక్షిణ మధ్యరైల్వే రిటైర్డ్‌ సీసీఎం భరత్‌ భూషణ్‌, పశుసంవర్ధక శాఖ అధికారి ముధుసూదన్‌ గైడ్‌, డీఆర్‌డీవో నర్సింహులు, డీపీఆర్‌వో శ్రీనివాస్‌, డీసీవో పద్మ, టీజీవో అసోసియే షన్‌ నల్లగొండ జిల్లా మాజీఅధ్యక్షుడు గోనె మోహన్‌రావు, ఆర్‌.శ్రీనివాస మూర్తి, చేనేత శాఖ ఏ.డి బాబు, ఎల్‌డీఎం భాస్కర్‌, సమాచార శాఖ డిప్యూటీ ఈఈ ఇస్రా, డీవైఎస్‌వో శ్రీనివాస్‌, మత్స్యశాఖ అధికారి చరిత పాల్గొని పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 10:55 PM