భూఆక్రమణలు, అక్రమనిర్మాణాలపై కఠినచర్యలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:06 AM
ప్రభుత్వ భూఆక్రమణలు, అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినచర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నారాయణఅమిత స్పష్టం చేశారు.

భూఆక్రమణలు, అక్రమనిర్మాణాలపై కఠినచర్యలు
సబ్ కలెక్టర్ నారాయణ అమిత
మిర్యాలగూడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూఆక్రమణలు, అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినచర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నారాయణఅమిత స్పష్టం చేశారు. శనివారం మునిసిపాలిటీ అనుమతులు లేకుండా ప్రధాన రహదారి సాగర్‌రోడ్డులో నిర్మించిన అక్రమ కట్టడాలను టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. అనంతరం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగర్‌రోడ్డులో మునిసిపాలిటీ అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం చేపట్టడమే కాకుండా ట్రేడ్ లైసెన్స పొందకుండా పెద్దఎత్తున చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ విషయమై రెండు నెలల క్రితం మునిసిపాలిటీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ నెల 18వ తేదీన మరోసారి నోటీసులు జారీ చేసినా సంబంధిత వ్యక్తులు స్పందించలేదని తెలిపారు. మునిసిపల్ చట్టం నిబందనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ దుకాణాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. నిర్మాణాలు చేపట్టే ముందు ఇంటి యజమాని మునిసిపాలిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే సహించేది లేదని, అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆ యన హెచ్చరించారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్ యూ సూఫ్, తహసీల్దార్ హరిబాబు ఉన్నారు.