Share News

ఆగిఉన్న లారీలే మృత్యుశకటాలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:25 AM

రకరకాల కారణాలతో నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై ఆపి ఉంచుతున్న లారీలు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. అతివేగంగా వస్తున్న ఇతర వాహనదారులు

ఆగిఉన్న లారీలే మృత్యుశకటాలు

కోదాడ వద్ద ఆగి ఉన్నలారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు

ఓ చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం

ఓఆర్‌ఆర్‌పై ఆగిఉన్న బొగ్గు లారీని ఢీకొట్టిన కారు

కారు దగ్ధం.. ఒకరి సజీవ దహనం

కోదాడ, బోనకల్‌, పటాన్‌చెరు, ఏప్రిల్‌ 25 : రకరకాల కారణాలతో నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై ఆపి ఉంచుతున్న లారీలు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. అతివేగంగా వస్తున్న ఇతర వాహనదారులు హఠాత్తుగా ఆ లారీలను చూసి వాటిని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో గురువారం జరిగిన ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో ఓ నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ప్రమాదంలో ఓ వ్యక్తి తన కారులోనే సజీవ దహనమయ్యాడు. సూర్యాపేట జిల్లా మునగాల వద్ద నాలుగు రోజుల క్రితం ఆగి ఉన్న లారీ కిందకు ఓ కారు దూసుకెళ్లి దంపతులు మరణించిన ఘటన మరువక ముందే కోదాడలో గురువారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టగా.. ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్‌(32), ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన నల్లమల కృష్ణరాజు (26) బావా బావమరుదులు. కృష్ణరాజు చెల్లెలు నాగమణితో శ్రీకాంత్‌కు వివాహమైంది. శ్రీకాంత్‌, కృష్ణరాజు హైదరాబాద్‌లో కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు లాస్య, లావణ్య(4) ఉన్నారు. కృష్ణరాజుకు తల్లిదండ్రులు నల్లమల చందర్‌రావు(52), మాణిక్యమ్మ (45), భార్య స్వర్ణకుమారి(23), పిల్లలు కౌశిక్‌, కార్తీక్‌ ఉన్నారు.


హైదరాబాద్‌, మణికొండలో నివాసముండే ఈ రెండు కుటుంబాలు శ్రీకాంత్‌ చిన్న కూతురు లావణ్య పుుట్టు వెంట్రుకలు తీయించేందుకు, చెవులు కుట్టించేందుకు విజయవాడ సమీపంలోని గుణదల మేరీమాత ఆలయానికి కారులో బయలుదేరాయి. మొత్తం పది మంది కలిసి ఎర్టిగా కారులో బుధవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లో బయలుదేరారు. కృష్ణంరాజు కారు నడుపుతుండగా.. అతివేగంగా ప్రయాణిస్తున్న వీరి కారు గురువారం ఉదయం 4:50నిమిషాల సమయంలో కోదాడ సమీపంలోని శ్రీరంగపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న శ్రీకాంత్‌, లాస్య, చందర్‌రావు, మాణిక్యమ్మ, కృష్ణరాజు, స్వర్ణకుమారి అక్కడికక్కడే మరణించారు. నాగమణి తీవ్రంగా గాయపడగా, చిన్నారులు లావణ్య, కౌశిక్‌, కార్తీక్‌కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారును బయటికి తీశారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్‌ సోదరుడు కిషోర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


ఓఆర్‌ఆర్‌పై వ్యక్తి సజీవ దహనం

పటాన్‌చెరు: ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగిన ఘటనలో కట్టెకోళ్ల శిరీష్‌(33) అనే వ్యక్తి సజీవదహనం అయ్యాడు. బీరంగూడకు చెందిన శిరీష్‌ మాదాపూర్‌లో హోటల్‌ వ్యాపారం చేస్తున్నారు. వ్యక్తిగత పనిమీద గురువారం ఉదయం సుల్తాన్‌పూర్‌ నుంచి ముత్తంగి వైపు ఎర్టిగా కారులో వెళ్లాడు. ముత్తంగి ఔటర్‌ రోడ్డు జంక్షన్‌కు కొద్ది దూరంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న బొగ్గు లారీని వెనక నుంచి శిరీష్‌ తన కారుతో అతివేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో శిరీష్‌ కారు రోడ్డు రెయిలింగ్‌, లారీకి మధ్య ఇరుక్కుపోగా.. కారులోని ఇంధన ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. బయటపడే దారి లేక కారులో ఇరుక్కుపోయిన శిరీష్‌ ఆ మంటల్లో సజీవదహనం అయ్యాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా బొగ్గులారీ వెనకభాగం కాలిపోయింది. పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు.

Updated Date - Apr 26 , 2024 | 05:25 AM