Share News

‘హౌసింగ్‌’ భూముల చుట్టూ కంచె!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:18 AM

రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(దిల్‌) పరిధిలోని భూముల రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆ భూముల చుట్టూ కంచె నిర్మించాలని, జియో గ్రాఫికల్‌

‘హౌసింగ్‌’  భూముల చుట్టూ కంచె!

జియోగ్రాఫికల్‌ మ్యాపింగ్‌కు సర్కారు నిర్ణయం

ప్రహరీలు నిర్మిస్తే మంచిదంటూ అధికారుల నివేదిక

ఇందుకు రూ.13-15 కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(దిల్‌) పరిధిలోని భూముల రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆ భూముల చుట్టూ కంచె నిర్మించాలని, జియో గ్రాఫికల్‌ మ్యాపింగ్‌ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు కూడా ఇప్పటికే ప్రాఽథమికంగా ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది. హౌసింగ్‌ బోర్డు, దిల్‌ పరిధిలో ఉన్న భూముఠిల చుట్టూ కంచె వేసినా కొంత కాలమే ఉంటుందని, ప్రహరీలు నిర్మిస్తేనే చాలా కాలం మన్నిక ఉండడంతోపాటు కబ్జాలకు ఆస్కారం ఉండదని అధికారులు చెప్పినట్టు సమాచారం. ప్రహరీల నిర్మాణానికి రూ.13-15కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. జియోగ్రాఫికల్‌ మ్యాపింగ్‌.. సాంకేతికతతో కూడుకున్న అంశం కావడంతో ఏదైనా కంపెనీతో ఒప్పందం చేసుకోవాలా? లేక ప్రభుత్వ పరిధిలోని ఏదైనా సంస్థకు బాధ్యతలు అప్పగించాలా? అన్న దానిపై తర్జన భర్జన నడుస్తోంది. జియోగ్రాఫికల్‌ మ్యాపింగ్‌, భూముల చుట్టూ ప్రహరీల నిర్మాణం రెండు ఏకకాలంలో పూర్తయితేనే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేదంటే భూముల హద్దుల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం హౌసింగ్‌ బోర్డు పరిధిలో 5,045 ఎకరాలు, దీని పరిధిలో ఏర్పాటు చేసిన దిల్‌ కింద 1,800 ఎకరాలను సేకరించింది. హౌసింగ్‌ బోర్డు కింద మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డితోపాటు నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం 4,230 ఎకరాలను వినియోగించారు. దాదాపు 124 ఎకరాల మేర లిటిగేషన్‌, కబ్జా వివాదాల్లో ఉండగా.. మరో 691 ఎకరాల భూమి మాత్రమే బోర్డు పరిధిలో ఉంది. మరోవైపు దిల్‌ పరిధిలోనూ 900-1000 ఎకరాల వరకు పలు వివాదాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. 800 ఎకరాలు మాత్రమే వివాదాలు లేని భూమి ఉంది. ఏపీ, తెలంగాణ విభజన తరువాత ఈ భూముల పంపకాల్లో వివాదాలు తలెత్తడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం వీటిని షెడ్యూల్‌ 9లో చేర్చింది. రాష్ట్రాలు విడిపోయి పదేళ్లవుతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. అయితే, హౌసింగ్‌, దిల్‌ భూములు కబ్జాల బారిన పడకుండా కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Mar 26 , 2024 | 03:18 AM