Share News

స్టార్టప్‌ ఆవిష్కరణలు భేష్‌

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:05 AM

‘‘తమిళనాడులో రాజకీయ జీవితంలో అడుగు పెట్టనంతవరకూ వైద్యురాలిగా సేవలందించా. అల్ర్టాసౌండ్‌ నిపుణురాలిగా చేశాను. అనేక తీవ్రతరమైన వ్యాధులను ముందుగా

స్టార్టప్‌ ఆవిష్కరణలు భేష్‌

21 ఏళ్లలో బయో ఆసియా సదస్సులతో అనేక విజయాలు

డాక్టర్‌గా, రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా చాలా గర్వంగా ఉంది

గ్రామీణ, పేద ప్రజలకూ టెక్నాలజీ అందాలి: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘తమిళనాడులో రాజకీయ జీవితంలో అడుగు పెట్టనంతవరకూ వైద్యురాలిగా సేవలందించా. అల్ర్టాసౌండ్‌ నిపుణురాలిగా చేశాను. అనేక తీవ్రతరమైన వ్యాధులను ముందుగా గుర్తించేందుకు అలా్ట్ర సౌండ్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయితే ఖర్చు ఎక్కువగా ఉందని అనేకమంది పేదలు దాన్ని వినియోగించుకోరు. ఫలితటంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చూశాను. అయితే తక్కువ ఖర్చుతో ఇక్కడ ఓ స్టార్టప్‌ అభివృద్ధి చేసిన రోబోటిక్‌ అలా్ట్రసౌండ్‌ టెక్నాలజీని చూశాక.. చాలా సంతోషంగా ఉంది’’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. బుధవారం హెచ్‌ఐసీసీలో జరిగిన బయోఆసియా ముగింపు సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. వైద్యరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న ఆవిష్కరణలతో పరిష్కారం చూపిన ఐదు స్టార్టప్‌లకు బయో ఆసియా స్టార్టప్‌ అవార్డులను అందజేశారు. వ్యాక్సిన్ల రవాణాలో ఉపయోగించే కోల్డ్‌ చైన్‌ టెక్నాలజీ, ఇతర ఆవిష్కరణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్న గవర్నర్‌.. వాటిని అభివృద్ధి చేసిన స్టార్టప్‌లకు, వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్న బయో ఆసియా సదస్సుకు అభినందనలు తెలిపారు. నోబెల్‌ విజేతలు సైతం వచ్చి ప్రసంగించడం ఈ సదస్సు విశిష్టతను తెలుపుతోందని ఆమె కొనియాడారు. కొవిడ్‌ సమయంలో తాను హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన టీకానే వేసుకున్నట్టు గవర్నర్‌ తెలిపారు. ఒక వైద్యురాలిగా, రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా.. బయో ఆసియా సాధించిన విజయాలు చూసి గర్విస్తున్నానన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలన్నీ పేద, గ్రామీణ ప్రజలకు అందినప్పుడే టెక్నాలజీ సార్థకం అవుతుందన్న ఆమె.. అలా అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా.. క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించే టెక్నాలజీలు పేద, గ్రామీణ ప్రజలకు అందాలన్నారు. కాగా.. 20 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సుకు నాంది పలికిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి.ఆచార్య మాట్లాడుతూ.. 2004లో బయో ఆసియా సదస్సును ప్రారంభించినప్పుడు ఇంతగా విజయం సాధిస్తుందని ఊహించలేదన్నారు. 2001లో జీనోమ్‌ వ్యాలీ ప్రారంభించినప్పుడూ.. దేశానికి బయోటెక్‌ హబ్‌గా మారుతుందని అనుకోలేదన్నారు. జీనోమ్‌ వ్యాలీ అభివృద్ధి వెనక అనేక సంవత్సరాల శ్రమ ఉందని గుర్తుచేసుకున్నారు. యానిమల్‌ బయో టెక్నాలజీ.. అభివృద్ధికి అవకాశమున్న కొత్త రంగమని, ఇక్కడ నేషనల్‌ యానిమల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఉండటంతో ఈ రంగంలో అనేక పరిశోధనలు చేయవచ్చని ఆచార్య పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సును ఈ స్థాయికి తెచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈసారి సదస్సులో 2737 మంది అతిథులు, 200 మంది ఎగ్జిబిటర్లు, 750 మంది సందర్శకులు పాల్గొన్నట్టు ఆయన వెల్లడించారు. ఫార్చ్యూన్‌ 500 జాబితాలోని నాలుగు కంపెనీల సీఈవోలు హాజరయ్యారని వివరించారు. 50 మిలియన్ల డెంగీ వ్యాక్సీన్ల తయారీకి టకేడా ఒప్పందం, లైఫ్‌ సైన్స్‌ రంగంలో రూ.2000 కోట్ల పెట్టుబడులు, హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌లో తొలి సీ4ఐఆర్‌ కేంద్రం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంతో కలిసి నెలకొల్పడం.. ఈసారి సదస్సు విశేషాలని తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 07:09 AM